రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లోని శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి తిరు నక్షత్ర మహోతవ్సం (64వ జయంతి వేడుకలు) జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా అక్కడకు వెళ్లి చిన జీయర్ స్వామిని దర్శించుకున్నారు.
భగవంతుడిని పూజించే సంస్కారం మా తల్లిదండ్రుల పరంపర నుంచి వచ్చిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు. దేవాలయం అంటే భగవంతుడిని ఆరాధించే కమ్యూనిటీ హాల్ అన్నారు. సిద్దిపేట మొదటి ఎమ్మెల్యే గురువారెడ్డి కమ్యూనిస్టు అయినప్పటికీ రామాలయం నిర్మించారని గుర్తుచేశారు.హైందవ సంప్రదాయంలో ఉండే శక్తి చాలామందికి తెలియదన్నారు.
హిందూ సంప్రదాయాన్ని కాపాడేందుకు చినజీయర్ స్వామిలాంటి వారు ఉన్నారని చెప్పారు. బీబీ నాంచారమ్మ జన్మవృత్తాంతం చాలామందికి తెలియదు.. యాదాద్రి పూర్తయిన తర్వాత మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని చెప్పారు. మహాసుదర్శణ యాగం కోసం ప్రపంచ వైష్ణవ పీఠాలకు ఆహ్వానం పంపిస్తామన్నారు. మహాసుదర్శన యాగంతో పాటు రామానుజస్వామి విగ్రహావిష్కరణ చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో కమలానంద భారతి స్వామి, విశ్వేశ తీర్థ స్వామి, విజయానంద స్వామి, శఠగోప రామనుజ పెరియర్ జీయర్ స్వామి, మైసూర్ అవదూతా దత్తపీఠాధిపతి సచిదానంద స్వామి, దత్త విజయానంద స్వామి, ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో పాటు మైహోం అధినేత జూపల్లి రామేశ్వర రావు రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.