ధాన్యం కోనుగోళ్ల కేంద్రాలలో మార్కెటింగ్ సిబ్బంది హెడ్ క్వార్టర్ లలో అందుబాటులో ఉండాలని సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఖరీఫ్ కొనుగోళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి గారు, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి గారు తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తేమ తనిఖీ యంత్రాలకు మరమ్మతులు చేయించి.. ధాన్యం శుద్దిచేసే యంత్రాలు సిద్దం చేయాలన్నారు.
నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల వద్ద ఏ టైం నుండి పత్తి కొనుగోళ్ళు ప్రారంభిస్తాము ? ఎప్పుడు ముగిస్తాం ? అనేది తెలిసేలా ఫ్లెక్సీ బ్యానర్లు ప్రదర్శించాలి. పత్తి తేమ శాతం ప్రకారం ధరల వివరాలను ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు పెట్టాలి. పత్తిని రైతు అమ్ముకునేందుకు ఏఏ దృవీకరణ పత్రాలు తేవాలో ఫ్లెక్సీ బ్యానర్ మీద ప్రదర్శించాలన్నారు. మిల్లు వద్ద రైతులు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలు, వే బ్రిడ్జ్ ధరలు, హమాలీ ఛార్జీలు ప్రదర్శిస్తూ బ్యానర్లు పెట్టాలి.
మార్కెట్ యార్డులో త్రాగునీరు, టాయిలెట్స్, కరంటు వంటి మౌళిక వసతులతో పాటు .. వార్డులను, రైతుల విశ్రాంతి భవనములను శుభ్రపరిచి సిద్దంగా ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరిగినన్ని రోజులూ సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. తప్పనిసరి పరిస్థితులలోనే ఉన్నతాధికారుల అనుమతితో సెలవు ఇవ్వాలన్నారు.