రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో టెక్నాలజీ సెంటర్స్ ( టీ సీ )ను, ఎక్స్ టెన్షన్ సెంటర్స్ ( ఈ సీ )ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం తన నివాసంలో కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్,ఎమర్జింగ్ టెక్నాలజీతోపాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, వృత్తి నైపుణ్యాన్ని అభివృద్ధి పర్చేందుకు రాష్ట్రంలో కొత్తగా టెక్నాలజీ సెంటర్స్ ( టీ సి ),ఎక్స్ టెన్షన్ సెంటర్స్ ( ఈ సి ) నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు.
వరంగల్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ను, కరీంనగర్ శివారులో ఎక్స్ టెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు కోసం సత్వరంగా స్థల సేకరణ పూర్తి చేయాలని ఆయన ఆయా జిల్లాల కలెక్టర్‌లకు సూచించారు. వీటితోపాటు సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కూడా ఎక్స్ టెన్షన్ సెంటర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ అధికారులకు సూచించారు.
ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌లో ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రితో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ ప్రాంతీయ సంచాలకులు రాజశేఖర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.