నగరంలో ట్రాఫిక్ రద్దీపై మంత్రి కేటీఆర్ సమీక్ష

414
ktr New
- Advertisement -

హైదరబాద్ నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న స్లిప్ రోడ్లపైన(ప్రధాన రోడ్లకు అనుసంధానించే రోడ్లు) పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు నగరంలో అత్యధిక ట్రాఫిక్ జాం ఉండే ప్రాంతాల్లో సాద్యమైనన్ని ఎక్కువ రోడ్లను ఏర్పాటు చేసి దీర్ఘకాలంలో రద్దీని తగ్గించడమే లక్ష్యంగా జియచ్ యంసి, హెచ్ యండిఏ, హైదరాబాద్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్ లు కలిసి రూపొందిచిన సమగ్ర నివేదికపైన ఈరోజు మంత్రి చర్చించారు. ఇందుకోసం క్షేత్రస్ధాయిలో ఉన్న పరిస్ధితులకు అనుగుణంగా ప్రణాళిక ఉండాలన్నారు. ప్రస్తుతం ఉన్న జనసాంద్రత, భవిష్యత్తు విస్తరణ, ట్రాఫిక్ అధ్యయనం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

నగర రోడ్డు నెట్ వర్క్ ను బలోపేతం చేసేందుకు అవసరం అయిన రైల్వే వంతెనలు( అర్వోబిలు, అర్ యూబీలను) గుర్తించి రైల్వే శాఖ నుంచి అనుమతులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. స్లిప్ రోడ్డులతోపాటు, మిస్సింగ్ లింక్ లను కలిపే చిన్న చిన్న రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. దీంతోపాటు యస్సార్డీపి పనులకు అదనంగా అవసరం అయిన చోట్ల జంక్షన్ల అభివృద్దిపైన కూడా దృష్టి సారించాలన్నారు.

ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న రోడ్డు నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేస్తూ మరిన్ని స్లిప్ రోడ్డులను ఏర్పాటు చేయాలని జియచ్ యంసిని అదేశించారు. ఇప్పటికే పలు నూతన రోడ్లను ఎప్పటికప్పుడు నిర్మిస్తున్న జియచ్ యంసి, ప్రస్తుతం ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో మెయిన్ రోడ్లను కలుపుతూ సాద్యమైనన్ని ఎక్కువ స్లిప్ రోడ్లను రూపొందించేందకు ప్రణాళిక సిద్దం చేస్తున్నది.

బోరబండ నుంచి మియాపూర్ వరకు ఉన్న మెయిన్ రోడ్డు నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ దిశగా స్లిప్ రోడ్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. దీంతోపాటు జూబ్లిహిల్స్ నుంచి నాలెడ్జ్ సిటీ వైపు, ఒల్డ్ ముంబై హైవే వరకు స్లిప్ రోడ్లను, నూతన రోడ్లను ఏర్పాటు చేయబోతున్నది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి కోకాపేట, కొల్లూర్, తెల్లాపూర్ వరకు ఒఅర్ అర్ ను కలుపుతూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రణాళికలో ఉన్న అర్టిలరీ రోడ్లకు అదనంగ నూతన రోడ్లను రూపకల్పన చేస్తున్నది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగే మిస్సింగ్ రోడ్ల వివరాలు ఇవ్వాలని కోరిన పురపాలక శాఖకు తెలపాలని పురపాలక కార్యదర్శి అరవింద్ కూమార్ కోరారు. దీంతోపాటు స్ధానిక రియల్ ఎస్టేట్ సంస్ధల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని తెల్పిన అయన పురపాలక శాఖకు తెలపాలని కోరారు.ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహాన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, కమీషనర్ లోకేష్ కుమార్, ఛీఫ్ సిటి ప్లానర్లు, ఛీఫ్ ఇంజనీర్లు మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -