హైదరాబాద్ నగరం పైన, మంత్రి కెటి రామారావు పైన నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన కాంత్, హైదరాబాద్ నగరం గత ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఈ మార్పుకి నాయకత్వం వహించిన మంత్రి కేటీఆర్ కి ఆయన అభినందనలు తెలియజేశారు.
మైక్రాన్ తన డెవలప్మెంట్ సెంటర్ ఎర్పాటు కోసం హైదరాబాద్ కి మించిన నగరం ఏది లేదన్న అమితాబ్ గా, ఇక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు పరిశోధన, సేవల అభివృద్ధి, ఆవిష్కరణలను హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నాయన్నారు. ఇందుకోసం అయా కంపెనీలకు అవసరమైన టాలెంట్ పూల్ హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్నదని అన్నారు. ప్రస్తుతం 18 దేశాల నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో మైక్రాన్ సంస్థ భవిష్యత్తు అంతా భారతదేశం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా పదింతలు వృద్ది చెందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన, హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతి కంపెనీ అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని తెలిపారు. మైక్రాన్ సంస్థ సెమీకండక్టర్ రంగంలో అమెరికాలో ప్రస్తుతం ఉన్న రెండవ స్థానం నుంచి ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి వెళ్లాలంటే, భవిష్యత్ ప్రణాళికలు, వృద్ది అంతా హైదరాబాద్ నగరం నుంచే సాద్యం అవుతుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ సెమి కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఐటి పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన ఈకో సిస్టమ్ సిద్ధంగా ఉన్నదని, ఇక్కడ ఉన్న ఐఐటి, ఐఐఐటి, మరియు ఉన్నత విద్యా ప్రమాణాలున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఇందుకు దోహదం చేస్తున్నయన్నారు.
మైక్రాన్ హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన అమితాబ్ కాంత్, ఇక్కడి వచ్చే కంపెనీలకు దగ్గరుండి ప్రోత్సాహం అందిస్తున్న డైనమిక్ మంత్రి కేటీ రామారావు అని ప్రసంశించారు. మంత్రి కేటీఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉందన్న ఆయన, అయనతో పనిచేయడం అదృష్టం అంటూ ప్రశంసలు కురిపించారు. గతంలో ఇవాంక్ హజరయిన ట్రంప్ గ్లోబల్ అంత్రప్రెన్యూర్ సమ్మిట్ సందర్భంగా ఆయన నిర్వహించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో మంత్రి అందించే సహకారం, అద్భుతమైనదన్న అమితాబ్ కాంత్, ఇలాంటి నాయకుడు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం పట్ల మైక్రాన్ సంస్ధను అభినందించారు.
గత ఐదు సంవత్సరాలుగా దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, 30 కోట్ల మందిని దారిద్ర్యరేఖ నుంచి పైకి తీసుకువచ్చామని, ముఖ్య గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో డాటా విప్లవం వలన అనేక మార్పులు రోబోతున్నవని, అమెరికా, చైనా, యూరప్ వంటి అనేక దేశాలతో పోల్చినప్పుడు ఇక్కడి మొబైల్ డాటా అత్యంత చవకైనదన్నారు. ఇక్కడి వందకోట్ల జనాభా ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ల వల్ల రానున్న రోజుల్లో డేటా రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. డేటా విప్లవం వలన, డిజిటలీకరణ అనేక నూతన అవకాశాలు ఎర్పడతాయన్నారు. భారతదేశంలోని సమస్యలకి సరైన పరిష్కారాలు కనుగొనగలిగితే, విశ్వవ్యాప్తంగా విస్తరించడం అత్యంత సులువని, ప్రపంచలోని అన్ని సమస్యలకు భారత్లోనే సమాధానం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కార్పొరేట్ల టాక్స్ వలన దేశం పెట్టబడులకు మరింత ఆకర్షణీయంగా తయారైందన్నారు.
అమెరికా కి చెందిన సెమి కండక్టర్స్ కంపెనీ మైక్రాన్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టాప్ సెమి కండక్టర్ కంపెనీ మైక్రాన్ హైదరాబాద్ లో తమ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు మంత్రి కెటియార్. ఇప్పటికే హైదరాబాద్ లో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఉన్నాయని, ఇక్కడ ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభించిన మైక్రాన్ సెమి కండక్టర్స్ మనుఫ్యాక్చరింగ్ యూనిట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం అవసరం అయన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. మైక్రాన్ తో కలిసి మరిన్ని సెమి కండక్టర్ కంపెనీలను హైదరాబాద్ కి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు….