అంగన్ వాడిల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా

436
min Satayavathi
- Advertisement -

అంగన్ వాడీ టీచర్లు, మినీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు దసరా పండగకు వేతనాలు ఇప్పించే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తానని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. రెండు నెలల వేతనాలు రావాల్సి ఉందని, ప్రతి నెల నెల చివర్లో వేతనాలు ఇస్తున్నారని, పండగ ఉన్నందున నెలాఖరులో వేతనం ఇస్తే ఇబ్బంది ఉంటుందని, త్వరగా ఇప్పించాలంటూ తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు బిక్షపమ్మ ఆధర్యంలో సంఘం నేతలు నేడు ఉదయం మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ను ఆమె నిలవాసంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు.

అంగన్ వాడీలు చాలావరకు ఒంటరి మహిళలు ఉన్నారని, వేతనాలపై ఆధారపడి పనిచేస్తున్నారని, పండగకు వేతనాలు రాకపోతే పండగ చేసుకోలేమని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి చెప్పుకోగానే వెంటనే స్పందించిన మంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి పండగకు వేతనాలు ఇవ్వాలని కోరుతానని చెప్పారు.

అంగన్ వాడీలకు ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇప్పటికే రెండుసార్లు వేతనాలు ఎక్కడా లేనంతా పెంచారని మంత్రి గుర్తు చేశారు. సిఎం కేసిఆర్ గారి నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా పనిచేయాలని సూచించారు.అంగన్ వాడీలకు వచ్చే పిల్లలను మీరు తల్లుల్లా చూసుకోవాలని, మీ సమస్యల తీర్చే పని నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఉద్యోగులు బతుకమ్మ ఆటలు ఆడుకునేందుకు మధ్యాహ్నం నుంచి వెసులుబాటు కల్పించాలని కోరగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, బతుకమ్మ ఆడుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆదేశించారు. అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న అంగన్ వాడీ భవనాల కిరాయిలు, వంట బిల్లులు , టీఏ, డీఏల బిల్లులు ఇప్పించాలని కోరారు.

అదేవిధంగా 2014 ప్రకారం వంట బిల్లులు ఇస్తున్నారని, పెరిగిన ధరల మేరకు ఈ బిల్లలు పెంచాలని కోరారు.అంగన్ వాడీల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వీటన్నింటిని సిఎంగారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా ప్రయత్నిస్తానన్నారు. అడిగిన వెంటనే స్పందించిన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి అంగన్ వాడీ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అంగన్ వాడీలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా పనిచేస్తామని తెలిపారు.

- Advertisement -