జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్…తిరుపతి బహిరంగ సభ తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తిరుపతి వేదిక ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై నినదించిన పవన్…ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని ప్రకటించారు. ఇంతకాలం టీడీపీ,బీజేపీలపై ఎప్పుడు ప్రత్యక్షంగా విమర్శలు చేయని పవన్….స్పెషల్ స్టేటస్ అంశంపై ఇరు పార్టీలపై తనదైన శైలిలో విరుచుకపడ్డారు. దీంతో ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇక టీడీపీని ఇరుకున పెట్టేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతిపక్షాలు…పవన్ వ్యాఖ్యలతో మరింత దూకుడును పెంచాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ స్టేటస్ అంశంతో పాటు టీడీపీని ఇరుకున పెట్టేందుకు కాపు రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్,వైసీపీ ఏకమై పోరుబాట పట్టాలని నిర్ణయించాయి.
మరోవైపు ప్రజలముందుకొస్తున్న పవన్ ని నిలువరించడానికి కాంగ్రెస్‌తో కలవడం, కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకురావటమే సరైన వేదికని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాసరి ఇంట్లో సమావేశమైన ముద్రగడ,బొత్స,అంబటిరాంబాబు …ముద్రగడ చేస్తున్న కాపు రిజర్వేషన్ ఉద్యమానికి కాపుల మద్దతు కూడగట్టడంలో తలమునకలయ్యారు.చిరంజీవి కాంగ్రెస్ వాడైనా చర్చల్లో దాసరి మాటకే ప్రాధాన్యం లభిస్తోందంట.చిరు మీద అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే దాసరికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వైసీపీ ముద్రగడ ఉద్యమాన్ని హైజాక్ చేస్తోందన్న వాదనలు కాపు నేతల నుంచే వినిపిస్తున్నాయి. అయితే,చిరు సైతం కాపు ఉద్యమంలో తనవంతు పాత్ర ఉండేలా వ్యుహ రచన చేస్తున్నారు.
ముద్రగడ వెనుకే కాపు సమాజం ఉందని చెప్పడానికే సమావేశమైనట్టు అంబటి చెప్పారు.తమతో కలిసొస్తారో లేదో పవన్ నే అడగాలని రాంబాబు వ్యాఖ్యానించారు.ఇంత మంది పెద్దలు కలిసినప్పుడు పవన్ తో ఓ మాట ఎందుకు చెప్పకూడదని పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కాకినాడలో సభ ప్రకటించిన నేపథ్యంలో….ముద్రగడ నేతృత్వంలో కాకినాడలో మరో సభను నిర్వహించేందుకు కాపు నేతలు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఎవరికి వారుగా 2019 ఎన్నికలే టార్గెట్‌గా సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు ఉహాల పల్లకిలో ఉరేగుతున్నారు. అయితే, ఎవరికివారుగా సీఎం పీఠంపై ధీమాగా ఉన్నా….ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయటం వల్ల ఓట్లు చీలి ఎవరికి లాభపడుతుందోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.