సింగరేణిలో డిస్మిస్డ్ కార్మికులకు మళ్లీ అవకాశం..

553
singareni
- Advertisement -

సింగరేణిలో వివిధ కారణాల రీత్యా 2000 సంవత్సరం నుండి 2018 మద్య డిస్మిస్ అయిన కార్మికులను ‘‘ఒక్క అవకాశంగా’’ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఒక చారిత్రక ద్వైపాక్షిక ఒప్పందం గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యానికి మధ్య కుదిరింది. దీని వలన సుమారు 356 మంది డిస్మిస్డ్ కార్మికులు తిరిగి ఉద్యోగాలు పొందే అవకాశం కలుగుతోంది.

హైద్రాబాద్ సింగరేణి భవన్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 20వ తేదీ) నాడు సంస్థ డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ మరియు గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ బి.వెంకట్రావు సమక్షంలో ఇరుపక్షాల వారు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.

డిస్మిస్డ్ కార్మికులు చాలా కాలంగా తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ వేడుకొంటున్నారు. గుర్తింపు సంఘం కూడా ఈ విషయంపై యాజమాన్యానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. దీంతో 2000 సంవత్సరం నుండి గత ఏడాది వరకూ దీర్ఘకాలంగా గైర్హాజరు, అనారోగ్య కారణాల వలన విధులకు హాజరు కాకుండా డిస్మిస్డ్ అయిన కార్మికులకు ఈ ఒప్పందం ద్వారా తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం కల్పించారు.

దీనిపై గుర్తింపు కార్మిక సంఘం వారు సింగరేణి సి అండ్‌ ఎం.డి. స్థాయిలో ఇటీవల జరిగిన స్ట్రక్చర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి విన్నవించారు. దీనిపై సి అండ్‌ ఎం.డి. ఎన్.శ్రీధర్ సానుకూలంగా స్పందించి డైరెక్టర్ పా స్థాయిలో దీనిని చర్చించవల్సిందిగా ఆదేశించారు. పలుమార్లు డైరెక్టర్ పా ఎస్.చంద్రశేఖర్, జి.ఎం. పర్సనల్ (ఐ.ఆర్., పి.ఎం.&ఆర్.సి.) శ్రీ ఎ.ఆనందరావు తో గుర్తింపు కార్మిక సంఘం నాయకులు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, తదితరులు చర్చించిన మీదట ఈరోజు శుక్రవారం (సెప్టెంబర్ 20వ తేదీ) నాడు ఒప్పందం కుదుర్చుకొని 356 మందికి తిరిగి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.

ఈ ఒప్పంద పత్రాలపై గుర్తింపు కార్మిక సంఘం నుండి బి.వెంకట్రావు (అధ్యక్షులు), మిర్యాల రాజిరెడ్డి (జనరల్ సెక్రటరీ), కె.వీరభద్రయ్య (సెంట్రల్ కమిటీ మెంబర్) యాజమాన్యం తరపున డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా ఎస్.చంద్రశేఖర్, జి.ఎం. పర్సనల్ (ఐ.ఆర్., పి.ఎం అండ్‌ ఆర్.సి.) ఎ.ఆనందరావు, జి.ఎం. (ఎం.ఎస్) ఎ.ఋష్యేంద్రుడు, డి.జి.ఎం. (పర్సనల్) ఐ.ఆర్. జె.చిత్తరంజన్ కుమార్ లు సంతకాలు చేశారు.

ఒప్పంద విశేషాలు :-

01.01.2000 సంవత్సరం నుండి 31.12.2018 మధ్య అనారోగ్యం వలన గైర్హాజరు కారణంగా డిస్మిస్ అయిన కార్మికులు నిబంధనలకు లోబడి తిరిగి ఉద్యోగం పొందడానికి అర్హులు.

కార్మికుడు డిస్మిస్ అయ్యే నాటికి ముందు గల 5 సంవత్సరాలలో ఏదైనా 2 సంవత్సరాల కాలంలో కనీసం 100 మస్టర్లు (హాజరు దినాలు) పూర్తి చేసి ఉండాలి. 01.07.2018 నాటికి 46 సంవత్సరాల వయసు దాటి ఉండకూడదు.

అలాగే వీరితో పాటు గతంలో డిస్మిస్ అయి, ఒక్క అవకాశంగా తిరిగి ఉద్యోగంలో చేరి, ట్రయల్ పీరియడ్‌లో (తొలి సంవత్సరంలో) కనీసం 190 మస్టర్లు కూడా పూర్తి చేయక ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా ఈ ఒప్పందం ద్వారా మరో చివరి అవకాశాన్ని కల్పించారు. అయితే తిరిగి ఉద్యోగంలో చేరగొరే డిస్మిస్డ్ కార్మికులు దరఖాస్తు తర్వాత కంపెనీ ఆసుపత్రులలో వైద్య పరీక్షలలో ఫిట్ కావాల్సి ఉంది.

ఇదొక సదావకాశం సద్వినియోగం చేసుకోండి : డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్

డిస్మిస్డ్ కార్మికులకు ఈ ఒప్పందం ఒక వరం లాంటిదని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్ శ్రీ ఎస్‌ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మానవత దృకృధంతో, ఎక్కువ మంది డిస్మిస్డ్ కార్మికులు తిరిగి ఉద్యోగంలో చేరేలా అవకాశం కల్పించామని. తిరిగి ఉద్యోగంలో చేరి, క్రమశిక్షణతో పనిచేస్తూ, కంపెనీకి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని తెలియజేశారు.

ఇదొక చారిత్రక ఒప్పందం : శ్రీ బి.వెంకట్రావు, అధ్యక్షులు టిబిజికెయస్

దాదాపు 356 మంది డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి ఉద్యోగం కల్పించేందుకు జరిగిన ఈ ఒప్పందం, గుర్తింపు కార్మిక సంఘం సాధించిన వాటిలో ఒక చారిత్రక విజయమని గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు బి.వెంకట్రావు అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరే కార్మికులు విధుల పట్ల, వారి కుటుంబాల పట్ల గౌరవంతో బాధ్యతతో పనిచేయాలని కోరారు. ఒప్పందానికి అంగీకరించిన సి అండ్‌ ఎం.డి. ఎన్.శ్రీధర్ కు, డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -