500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సహా.. దేశవ్యాప్తంగా ఉన్న భాజపా ఎంపీలు, ఎమ్మేల్యేలు,, ప్రజాప్రతినిధులందరూ తమ బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాలని మోడీ ఆదేశించారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను జనవరి 1న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సమర్పించాలని మోడీ సూచించారట.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ‍్యంలో పారదర్శకంగా ఉండేందుకు బీజేపీ చట్టసభ సభ్యులు బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భాజపా పార్లమెంటరీ సమావేశంలో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీత్ షా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకే బ్యాంకు ఖాతాల వెల్లడి నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో నల్లకుభేరుల్లో వణుకు పుట్టినస్తున్న మోడీ..తాజాగా పార్టీ ప్రజాప్రతినిధులపై కూడా బ్రహ్మాస్త్రం వేశాడు. పార్టీ నేతలు కూడా ఖాతా వివరాలు వెల్లడించాలంటూ పార్టీలో ఉన్న నల్లధనాన్ని ప్రక్షాళన చేసే కీలక నిర్ణయం తీసుకున్నాడు. మరి దీనిపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి.