నవ్యాంధ్రప్రదేశ్ తొలిస్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు కోడెల. పల్నాడు పులిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కోడెల…ఉరికి వేలాడుతూ కనిపించడం చూసి వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
పల్నాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా ముద్ర వేశారు కోడెల. టీడీపీ సీనియర్ నేతగా మాజీ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల …ఎన్టీఆర్,చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు.
నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేసిన కోడెల గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఆయనతో పాటు కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
బసవతారం ఆస్పత్రి ఫౌండర్ మెంబర్‌గా, ఆస్పత్రి ఛైర్మన్‌గా పనిచేశారు కోడెల.1983లో ఎన్టీఆర్ పిలుపుతో డాక్టర్‌గా ఉన్న ఆయన రాజకీయాల్లోకి వచ్చి …తనదైన ముద్రవేశారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా, పవర్ ఫుల్ మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. కోడల ఇలా బలవన్మరణానికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.