కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే గర్వ కారణమన్నారు చాంద్రాయణ్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేసిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.
మిషన్ భగీరథ, కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం పైసా ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ కృషితో రికార్డు టైంలో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆసరా పెన్షన్లు పెంచినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ఆరోగ్య శ్రీ పథకం వల్లే ఎక్కువ మందికి ఉచిత వైద్యం అందుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల దేశ ఆర్దిక వ్యవస్ధ కుదేలవుతుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోందన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు అన్ని రంగాలపై ప్రభావం చూపింది. కేంద్రం నిధులు, రాష్ర్టానికి రావాల్సిన పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆర్థికాభివృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.