ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను నేడు రవీంద్రభారతిలో ఘనంగా సత్కరించింది. పాఠశాల విద్య నుంచి 43 మంది, జూనియర్ కాలేజీల నుంచి 10మంది, ఎయిడెడ్ కాలేజీల నుంచి 5 మంది, డిగ్రీ కాలేజీల నుంచి 14 మంది, విశ్వవిద్యాయాల నుంచి 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి సత్కరించి, 10 వేల నగదు బహుమతి, బంగారు పూత పూసిన వెండి పతకం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష రెడ్డి మాట్లాడుతూ.. గురువులను గౌరవించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ముందుంటాడని, ఆయనకు విద్యాబుద్దులు నేర్పిన గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఉపాధ్యాయులను మన దేశంలో చాలా గౌరవిస్తారని, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నంత గౌరవం, సంతృప్తి మరే వృత్తిలో దొరకదన్నారు. సమాజంలో గొప్ప వాళ్లను తయారు చేసేది ఉపాధ్యాయులు అన్న విషయం మరిచిపోకూడదన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై చాలా చర్యలు తీసుకుంటున్నామనీ, గురుకుల విద్యను ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు.