గవర్నర్‌గా తాను ఎలాంటి రాగద్వేషాలకు, ప్రాంతీయ, రాజకీయ పక్షపాతాలకు తావివ్వలేదని తెలిపారు గవర్నర్ నరసింహన్. తొమ్మిదిన్నరేళ్లు గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్ రాజ్‌భవన్‌లో మీడియా చర్చాగోష్టి సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమం అహింసాయుతం…పోలీసులు ఎంతో సమర్థంగా వ్యవహరించారని చెప్పారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఉందని…ఎన్నో మధుర జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని చెప్పారు. చెన్నైకి వెళ్లి సామాన్యుడిలా జీవిస్తానని…ఇడ్లీ, సాంబారుతో శేషజీవితాన్ని ఆస్వాదిస్తానని చెప్పారు.
ఆలయాలకు వెళ్తారంటూ తనపై కొందరు చేసిన ఆరోపణలు ఎంతగానో బాధించాయని తెలిపారు. దేవుడు, పెద్దలంటే తనకు విశ్వాసం ఎక్కువ అని..తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో తాను తెలంగాణకు వ్యతిరేకమని ప్రచారం చేశారని కానీ రాజకీయ పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించాయని కితాబిచ్చారు. తొమ్మిదిన్నరేళ్లలో తనకు సహకరించిన మీడియాకు గవర్నర్ నరసింహన్ ధన్యవాదాలు తెలిపారు.
యువత ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని..మన రాష్ట్రం, మన ప్రజలు అనే భావన ఉండాలని, ఆత్మను నమ్మి లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యమివ్వాలన్నారు.