ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా సింధు ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. సింధుతో పాటు ఆమె తల్లితండ్రులు కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేష్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మనస్ఫూర్తిగా సింధును అభినందించారు. సింధు దేశగౌరవాన్ని నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారిందని సిఎం అన్నారు. సింధు రెండు రాకెట్లను సిఎంకు బహుకరించారు. అనంతరం సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువాతో సన్మానించారు.
ప్రపంచ చాంపియన్ షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కరుగా నిలిచారు. ఇది మనందరికీ గర్వకారణం. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యం కాదన్నారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్ చక్కగా శిక్షణ ఇచ్చారని తెలిపారు. సింధు భవిష్యత్తులో ఇంకా అనేక టోర్నమెంట్లలో పాల్గొనాలని కోరుతున్నట్లు తెలిపారు.