పెద్ద నోట్లు రద్దు చేసి మూడు వారాలు గడుస్తున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించట్లేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడిందనే చెప్పాలి. కొత్త రూ.500 నోట్లు బ్యాంకులకు చేరడంతో కాస్త ఊరట కనిపించింది. అయితే ప్రజలకు ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో వారిలో నిరాశ ఆవరించింది.
26వ తేదీ నాలుగో శనివారం, 27 ఆదివారం కావడంతో రెండు రోజులు బ్యాంకులకు తాళాలు తప్పని పరిస్థితి. బ్యాంకులు తెరుచుకోక, ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు అష్టకష్టాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి శని, ఆదివారాల్లో సరిపడా నగదును ఏటీఎంలలో సర్దితే ప్రజల కష్టాలు కొంతవరకైనా తీరే అవకాశం ఉంటుందని అంటున్నారు.
మరోవైపు పెద్దనోట్ల రద్దుతో తెలంగాణవ్యాప్తంగా నగదు కొరత అధికంగా ఉంది. ఎక్కువ బ్యాంకుల్లో నగదు లేదన్న బోర్డులే కనిపించాయి. కొన్ని బ్యాంకులు రేషన్ పద్ధతిలో నగదు ఇచ్చి సర్దుబాటు చేశాయి. చెక్కు ద్వారా రూ.20 వేలు అడిగితే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చాయి. ఏటీఎంల పరిస్థితి దయనీయంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వారానికి రూ.25వేల వరకు పరిమితి ఉన్నా, రోజూ రెండు నుంచి నాలుగు వేల మధ్య అతికష్టం మీద సర్దుబాటు చేస్తున్నారు. వ్యవసాయపనులు పక్కనపెట్టి డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 28న నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్‌లో బ్యాంకులు కూడా పాల్గొంటే వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అదే కనుక జరిగితే నోట్ల రద్దు మరుసటి రోజు నాటి పరిస్థితి మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.