ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా?

243
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో బాగంగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీకి వెళ్లాల్సి ఉంది. కానీ, అలా వెళ్లకుండా అక్కడే కొద్దిసేపు ఆగారు. గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌లతో పది నిమిషాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు అనంతర పర్యవసానాల గురించి వారిద్దరి వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి ప్రజలకు అవసరమైన మేరకు డబ్బులు అందుతున్నాయా? ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా? నగదు నిల్వలు చేరాయా? అని ప్రధాని ప్రశ్నించినట్లు సమాచారం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు చేరుతున్నాయా అని ప్రధాని అడిగినట్లు తెలిసింది.

CyHT_YVUsAAYKOs

చిన్న నోట్ల కొరత ఉందని సీఎం కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తెచ్చారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదన్నారు. రూ.రెండు వేల నోటుకు చిల్లర సమస్యగా ఉండడంతో దానిని తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడడం లేదని ప్రధానికి వివరించారు. రోజుకు రూ.రెండేసి వేల పరిమితితో రైతులకు అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందడం లేదని వివరించినట్లు తెలిసింది. విత్తనాలు, ఎరువుల సరఫరా సందర్భంగా రైతులకు ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. రూ.ఐదు వందల నోట్లు రాష్ట్రానికి పంపించామని ప్రధాని చెప్పగా.. అవి శుక్రవారమే రాష్ట్రానికి చేరాయని సీఎం పేర్కొన్నారు.

అక్కడి నుంచి నేరుగా జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లారు మోడీ.  శనివారం ఉదయం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు డీజీపీలతో కలిసి నడిచారు. అనంతరం వారితో కలిసి 7.30 వరకు యోగసనాలు వేశారు. తరువాత ఉదయం 8 గంటలకు డీజీపీలతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఆ తరువాత డీజీపీ/ఐజీపీల సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. ఢిల్లీకి బయలుదేరుతారు.

శుక్రవారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 51వ వార్షిక సదస్సు జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ డిజీపిల సదస్సును ప్రారంభించారు. సదస్సులో అన్ని రాష్ట్రాల డీజీపీలు, నిఘా విభాగాల అధిపతులు పాల్గొన్నారు. శనివారం మోడీ పాల్గోనే ఈ సమావేశంలో సుమారు పదిహేడు అంశాలపై స‌మీక్ష నిర్వహించనున్నారు.

ప్రతి సంవత్సరం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్/ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీసు సంస్థల అధిపతులతో కేంద్రప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 51వ వార్షిక సదస్సు జరుగుతోంది. సాధారణంగా ఈ వార్షిక సదస్సులను 2013 వరకు ఏటా ఢిల్లీలోనే నిర్వహించేవారు. 2014లో తొలిసారిగా ఢిల్లీకి వెలుపల అస్సాంలోని గువాహటిలో నిర్వహించారు. గతేడాది గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో జరగగా.. ఈ ఏడాది హైదరాబాద్ ఇందుకు వేదిక అయింది. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్‌‌స బ్యూరో అధికారులకు రాష్ట్రపతి పోలీసు పథకాలను, పోలీసు పథకాలను ప్రదానం చేయనున్నారు.

- Advertisement -