గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మై జిహెచ్ఎంసి యాప్, కాల్ సెంటర్, ప్రజావాణి, ఆన్ లైన్‌ల ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి జిహెచ్ఎంసి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జీహెచ్ఎంసి పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలు, టౌన్‌ప్లానింగ్, డ్రైనేజి, ఇంజనీరింగ్ తదితర అంశాలకు సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆగష్టు 15వ తేదీ వరకు నాలుగున్నర నెలలలో మొత్తం 96,927 ఫిర్యాదులు అందగా 80,807 (82.95శాతం) ఫిర్యాదులను జిహెచ్ఎంసి అధికారులు పరిష్కరించారు. ఈ ఫిర్యాదుల పరిష్కారంలో ఫిర్యాదు దారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో 2,141 తిరిగి ఓపెన్ చేయగా,1,530 ఫిర్యాదులు పరిష్కార దిశలో ఉన్నాయి. మరో 12,449 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి.
పెండింగ్‌లో ఉన్న 12,449 ఫిర్యాదుల్లో అధిక శాతం భారీ బడ్జెట్, దీర్ఘకాలిక ప్రణాళికలు, వివిధ శాఖల సమన్వయంతో చేపట్టాల్సి ఉండడం తదితర కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నాయి. కాల్‌సెంటర్, డయల్ 100, మై జిహెచ్ఎంసి యాప్, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ద్వారా అందే విజ్ఞాపణలను పరిష్కారంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రజలకు జవాబుదారిగా ఉండాలని జిహెచ్ఎంసి అధికారులకు కమిషనర్ ఎం.దానకిషోర్ స్పష్టమైన ఆదేశాలను జారీచేశారు. ముఖ్యంగా ప్రత్యేక యాప్‌ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పలుమార్లు సమీక్ష సమావేశాల్లో ఆదేశించారు. కాగా మై జిహెచ్ఎంసి యాప్, ప్రజావాణి, ఆన్ లైన్, కాల్ సెంటర్, ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై కమిషనర్ దానకిషోర్ సమీక్ష నిర్వహించారు.
జిహెచ్ఎంసి కి అందే ఫిర్యాదుల పరిష్కారంలో అల్వాల్, కాప్రా, సికింద్రాబాద్, చందానగర్, హయత్ నగర్ సర్కిళ్లు అగ్రస్థానంలో నిలువగా, మెహిదీపట్నం, కార్వాన్, రాజేంద్రనగర్, గోషామహల్, కూకట్ పల్లి సర్కిళ్లు సమస్యల పరిష్కారంలో అట్టడుగు స్థానంలో నిలిచాయి. గత సంవత్సరం జూలై 15న జీహెచ్ఎంసి ప్రారంభించిన మై జిహెచ్ఎంసి యాప్ పౌర సమస్యల పరిష్కారంలో దేశంలోనే ఉత్తమ యాప్‌గా రూపొందడంతో పాటు ఈ యాప్‌ను అతితక్కువ సమయంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 8,78,453 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ తో పాటు ఇతర మార్గాల ద్వారా ఇప్పటి వరకు అల్వాల్ సర్కిల్ కు 4,814 ఫిర్యాదులు అందగా వీటిలో 4,482 ఫిర్యాదులు 93.10 శాతం ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా గ్రేటర్ లోని అన్ని సర్కిళ్ల కన్నా అల్వాల్ సర్కిల్ అగ్రస్థానంలో నిలిచింది.
4,589 ఫిర్యాదులు కాప్రా సర్కిల్ కు అందగా 4,192 (91.35శాతం) ఫిర్యాదులను పరిష్కరించి ద్వితీయ స్థానంలో నిలువగా, 2,610 ఫిర్యాదులు అందగా 2,364లను (90.57శాతం) పరిష్కరించడం ద్వారా సికింద్రాబాద్ సర్కిల్ తృతీయ స్థానంలో నిలిచింది. అందిన 5,096 ఫిర్యాదుల్లో 4,597 (90.21శాతం) పరిష్కరించడం ద్వారా చందానగర్ నాలుగో స్థానంలో నిలువగా, 90శాతం ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా హయత్ నగర సర్కిల్ ఐదో స్థానంలో నిలిచింది. జిహెచ్ఎంసికి అందిన మొత్తం ఫిర్యాదుల్లో 82.95శాతం ఫిర్యాదులు పరిష్కారమై సంతృప్తిగా ఉన్నప్పటికీ ఈ ఫిర్యాదులు వంద శాతం పరిష్కరించడానికి కమిషనర్ ఎం.దానకిషోర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. దీనిలో భాగంగా ఫిర్యాదుల పరిష్కారంలో తక్కువ ఫర్ పార్మెన్స్ కనబర్చిన డిప్యూటి కమిషనర్లతో ప్రత్యేకంగా విడివిడిగా మాట్లాడి కమిషనర్ దానకిషోర్ సమీక్షిస్తున్నారు.
నగరంలో వివిధ సమస్యలపై మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా చేసే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే తమ ఫిర్యాదుల పరిష్కారానికి చేపట్టిన చర్యలు సంతృప్తిగా ఉన్నాయా, శాశ్వత పరిష్కారం లభించిందా, జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే స్పందించారా అని ఫిర్యాదుదారుల నుండి సమాచారాన్ని కూడా పొందే ప్రత్యేక యంత్రాంగాన్ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ మాసం నుండి ఆగుష్టు 15వ తేదీ వరకు వివిధ అంశాలపై 96,927 ఫిర్యాదులు అందగా వీటిలో 80,807 ఫిర్యాదులను పరిష్కరించారు. అయితే ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదులల్లో జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ద్వారా ఫోన్‌చేసి సమస్య పరిష్కారంపై సంతృప్తికరంగా ఉన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారంలో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో 2,141 ఫిర్యాదులను తిరిగి ఓపెన్ చేసి పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. ఈ ఫీడ్ బ్యాక్ విధానం వల్ల సమస్యల పరిష్కారంలో జీహెచ్ఎంసీ మరింత పారదర్శకంగా ఉంటుందని, దీంతో పాటు సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించినట్టు తప్పుగా రిపోర్ట్ చేసే జీహెచ్ఎంసీ అధికారులను కూడా గుర్తించేందుకు వీలవుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు.
సరళీకృత పరిపాలన విధానంలో భాగంగా జీహెచ్ఎంసి ప్రవేశపెట్టిన మై జిహెచ్ఎంసి ప్రత్యేక యాప్‌ను రికార్డు స్థాయిలో మొత్తం 8,78,453 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కేవలం హైదరాబాదీలే కాకుండా అమెరికా, సౌదీ, అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేడ్స్, కతార్, సింగాపూర్, బ్రిటన్, జర్మనీ, కువైట్, అంకాంగ్, నెదర్‌లాండ్, మలేషియా, కెనడ, చైనా, ప్రాన్స్ తదితర దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఈ మై జిహెచ్ఎంసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా జీహెచ్ఎంసికి సంబంధించిన పలు పనులు అత్యంత వేగంగా, పారదర్శకంగా కావడంతో హైదరాబాద్ నగరంతో పాటు దేశ విదేశాల్లోని నగరవాసులు కూడా ఈ యాప్ ద్వారా తమ సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తేవడంతో పాటు ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్, ఎల్.ఆర్.ఎస్. జనన, మరణ దృవీకరణ పత్రాలను పొందుతున్నారు. ఈ యాప్ లో ఉన్న మస్కిటో యాప్ ద్వారా కూడా దోమల నివారణ, చైతన్యానికి పొందుపర్చిన 17 ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఇవ్వడం ద్వారా సరైన సమాధానాలు అంధించిన పది మందికి రూ. 10వేల చొప్పున నగదు బహుమానాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా జిహెచ్ఎంసి కమిషనర్ తిరిగి ప్రారంభించారు.