కర్ణాటక కేబినెట్‌ విస్తరణకు ముహుర్తం ఖరారు..!

449
yediyurappa
- Advertisement -

కర్ణాటక సంకీర్ణ సర్కార్‌కు చెక్ పెడుతూ నాలుగోసారి కర్ణాటక సీఎంగా బీజేపీ నేత బీఎస్ యెడియూరప్ప ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న యెడ్డీకి బీజేపీ అధిష్టానం గుడ్ న్యూస్ అందించింది. హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆశావహుల జాబితాను వారికి అందించినట్లు సమాచారం.

అంతా అనుకున్నట్టు జరిగితే ఈనెల 19న మంత్రివర్గ ఏర్పాటు ఉండే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం కూడా దాదాపు ఖరారు కావడంతో ఆశావహులు లాబీయింగ్‌ ముమ్మరం చేశారు.

కేబినెట్‌ బెర్తులకోసం దాదాపు 50 మంది పోటీ పడుతుండగా తొలిదశలో 10-12 మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా మంత్రివర్గ కూర్పు చేయనున్నట్టు సమాచారం.

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హైకమాండ్ తరపున ప్రముఖ నేతలు ఎవరూ హాజరు కాలేదు. అయితే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ పెద్దలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కూలడానికి కారణమైన 17 మంది అనర్హత ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో వీరికి ఇప్పట్లో ఛాన్స్ లేనట్లే. మొత్తంగా కేబినెట్‌లో ఛాన్స్ దక్కించుకునే వారేవరా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -