ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రైశైలం, నాగార్జున సాగర్ లలో పూర్తిస్ధాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు తెలంగాణ విద్యుత్ సిఎండి ప్రభాకర్ రావు. సూర్యపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నేడు పరిశీలించారు సిఎండి.
ఈసందర్భంగా సీఎండి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. రైతులకు, పరిశ్రలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా విద్యుత్ ను వినియోగించే విధంగా గ్రిడ్స్ ద్వారా రెడీగా ఉన్నట్లు తెలిపారు. శ్రీశైలంలో మొత్తం ఆరు యూనిట్లు (900మెగా వాట్లు), నాగార్జున సాగర్ లో (815మెగావాట్లు ) విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ విషయంలో సీఎం కేసీఆర్ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారన్నారు. నిరంతర విద్యుత్ విషయంలో పూర్తిస్ధాయిలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. విద్యుత్ విషయంలో ఎప్పటికప్పుడు పూర్తి నివేదికను సీఎం కేసీఆర్ కు అందజేస్తున్నామని చెప్పారు.