ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కేవలం ఎనిమిదిరోజుల వ్యవధిలోనే శ్రీశైలం జలాశయాం నిండుకుండలా మారగా గేట్ల ఎత్తివేతతో నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది.
క్రమక్రమంగా సాగర్‌కు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో నాలుగు గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 226 టీఎంసీలు ఉంది.
జూరాల జలాశయానికి ఏకంగా 8.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా ప్రస్తుతం జూరాల జలాశయంలో ఐదున్నర టీఎంసీల నీటి నిల్వ ఉండగా భారీగా వస్తున్న వరద దృష్ట్యా 62 గేట్లను ఎత్తి 8.54 లక్షల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 8.52 లక్షల క్యూసెక్కులకుపైగా ఉండటంతో అవుట్‌ఫ్లో 8.87 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పది గేట్లను 33 అడుగుల వరకు ఎత్తి నీటిని నదిలోకి వదులుతున్నారు.