బకాయిలపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి..

353
Commissioner Akun Sabharwal
- Advertisement -

కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిల వసూలుపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా ఎగవేతదారుల జాబితాను తయారు చేసింది. 2010-11 నుంచి 2014-15 వరకు 89 మంది మిల్లర్ల నుంచి రూ. 117.22 కోట్ల విలువ చేసే 73 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది.

సోమవారం పౌరసరఫరాల భవన్‌లో సీఎంఆర్‌ ఎగవేసిన మిల్లర్లతో కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ సమావేశమయ్యారు. ఒక్కొక్క మిల్లర్‌తో కమిషనర్‌ నేరుగా మాట్లాడారు. దాదాపు 32 మంది మిల్లర్లు బకాయిలు చెల్లించడానికి ముందుకొచ్చారు. ఈ 32 మంది మిల్లర్ల బకాయి రూ. 44.55 కోట్లు ఉంది. మొదటి విడత 25% కింద రూ. 11.14 కోట్లు చెల్లించడానికి మిల్లర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు.

Civil Supplies Commissioner

మిల్లర్లకు సీఎంఆర్‌ కింద ప్రభుత్వానికి ఇవ్వవలసిన బియ్యాన్ని అప్పగించాలని, ఇందుకోసం వారికి కొంత వెసులుబాటును కూడా కల్పిస్తున్నామని కమిషనర్‌ అన్నారు. 25% చొప్పున నాలుగు విడతులుగా బకాయిలు చెల్లించడానికి అవకాశమిచ్చారు. మొదటి విడతలో 25% సీఎంఆర్‌ బియ్యాన్ని అప్పగించి, మిగిలిన 75% శాతానికి బ్యాంక్‌ గ్యారంటీ ఇస్తే వచ్చే ఖరీఫ్‌లో మిల్లింగ్‌ సామర్థ్యాన్ని బట్టి ధాన్యాన్ని కేటాయించడం జరుగుతుందన్నారు.

బియ్యానికి బదులు మార్కెట్‌ ధర ప్రకారం నగదు చెల్లించే అంశాన్ని పరిశీలించాలని, అలాగే వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాలని, బ్యాంక్‌ గ్యారంటీ కాకుండా కొలాట్రల్‌ ష్యూరిటీని పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా కొంతమంది మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో చర్చించి సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు. పాత బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సీఎంఆర్‌ బకాయిల వల్ల ప్రభుత్వంపై అధిక వడ్డీ భారం పడుతోందని, బకాయిల వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్లు ఎవరైనా 2019-20 ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం సీఎంఆర్‌ బకాయిలను తిరిగి అప్పగించిన పక్షంలో ఆ మిల్లర్లకు ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని ఇస్తామని అన్నారు.

2019-20 రబీకి ముందు మరో 25% సీఎంఆర్‌తో పాటు ఆ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ను కూడా అప్పగించాలని, 2020-21 ఖరీఫ్‌ సీజన్‌లో కూడా ఈ పద్ధతి కొనసాగుతుంది. నిర్ణీత గడువులోగా సీఎంఆర్‌ బకాయిలను అప్పగించి ‘నో డ్యూస్‌’ సర్టిఫికేట్‌ను పొందవచ్చని అన్నారు.

- Advertisement -