కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు , ‘కేఫ్ కాఫీ డే’ డే వ్యవస్ధాపకుడు వీజీ సిద్దార్ధ సోమవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేత్రావతి నది బ్రిడ్జిపై కారులో వెళుతున్న వీజీ సిద్ధార్థ.. నేత్రావతి నది వంతెన రాగానే ఆపారు. కారు దిగిన ఆయన.. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. ఆయన కోసం వెతికినా కనిపించలేదు. మంగళూరులోని ఉల్లాల్‌లో బ్రిడ్జిపై నుంచి ఆయన దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఫోన్ మాట్లాడుతూ కారు దిగిన సిద్ధార్థ.. నది వైపు వెళ్లి తిరిగి రాలేదని ఆయన ఫ్యామిలీకి కారు డ్రైవర్ సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.
జిల్లా యంత్రాంగానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని గాలింపును పర్యవేక్షించారు. వరద కారణంగా నేత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని పోలీసులు తెలిపారు. సిద్దార్ధ అదృశ్యం కావడంతో కర్ణాటకలో కలకలం రేపుతోంది. 1990లో మొదటిసారి బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో కేఫ్ కాఫీ డేను సిద్ధార్థ ప్రారంభించారు.