టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సదర్భంగా వినూత్న ప్రయత్నం చేపట్టారు రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్. స్పందించే హృదయంతో, తానున్నానంటూ అవసరం ఉన్న వారిని ఆదుకోవటంలో మందుంటూ, అందరూ సంతన్నగా ప్రేమగా పిలుచుకునే రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
కేటీఆర్ జన్మదినం (జూలై 24న) సందర్భంగా ఓ రిజర్వ్ ఫారెస్ట్ ను అభివృద్ది చేసేందుకు దత్తత తీసుకుంటున్నట్లు సంతోష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన పుట్టినరోజు సందర్భంగా హంగూ ఆర్భాటాలూ, అనవసర ఖర్చులు వద్దని, పార్టీ శ్రేణులు, అభిమానులు అవసరంలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయాలని, సమాజ హితం కోసం పనిచేయాలని కేటీయార్ పిలుపు నిచ్చారు. నే నినాదాన్ని ట్విట్టర్ లో కేటీయార్ పోస్ట్ చేశారు.
దీనిని స్ఫూర్తిగా తీసుకున్న సంతోష్, హైదరాబాద్ శివార్లలో ఉన్న కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్ లో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా అమలు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్దిలో భాగంగా ఈ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కును తన సొంత ఎం.పీ నిధులతో తీర్చిదిద్దుతామని సంతోష్ వెల్లడించారు. త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతంలో పర్యటించి, అభివృద్ది ప్రతిపాదనలు సిద్దం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతంగా ఉన్నాయని, పట్టణప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవనవిధానం అలవర్చుకునేందుకు ఇవి తోడ్పాటునిస్తాయని సంతోష్ అన్నారు.
వారాంతాల్లో కుటుంబంతో సహా సేద తీరే చక్కని ప్రాంతాలుగా, పిల్లల్లో పర్యావరణం, అటవీ, జీవ వైవిధ్యం ప్రాధాన్యతలు తెలుసుకునే ప్రాంతాలుగా ఈ అర్బన్ ప్రాంతాల అభివృద్ది జరుగుతోందన్నారు. కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని మంచి ఎకో టూరిజం ప్రాజెక్టుగా తీర్చి దిద్ది హైదరాబాద్ వాసులకు బహుమతిగా ఇస్తామన్నారు. యాదాద్రి, కీసరగుట్టలకు వచ్చే భక్తులు, పర్యాటకులకు కూడా ఈ ఎకో టూరిజం పార్కు అందుబాటులో ఉంటుదని సంతోష్ కుమార్ తెలిపారు. అలాగే తన ట్విట్టర్ ద్వారా మరికొందరు ప్రముఖులను కూడా ట్యాగ్ చేసిన సంతోష్ అటవీ ప్రాంతాల అభివృద్దిలో, అర్బన్ లంగ్ స్పేస్ ల అభివృద్దిలో పాలుపంచుకోవాల్సిందిగా ఆహ్వానించారు. సంతోష్ తీసుకున్నది మంచి నిర్ణయం అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు, ప్రశంసిస్తూ మెసేజ్ లు పోస్ట్ చేశారు.