పెద్ద నోట్ల చెలామణీ రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇపుడా పాతనోట్లను మార్చుకోవడానికి గత రెండు వారాలుగా బ్యాంకులు, ఏటీఎం ముందు భారీగా క్యూలైన్లే దర్శనం ఇస్తున్నాయి. అవసరాలకు సరిపడా డబ్బు కోసం గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక అందరికీ పెద్ద మొత్తంలో సర్దుబాటు చేసేంత డబ్బు బ్యాంకుల దగ్గర కూడా లేకపోవడంతో రూ. 2000 నోటు మాత్రమే ఇచ్చి పంపిచేస్తున్నారు.
అయితే, హైదరాబాద్‌లో మాత్రం రెండు వేల నోటు మినహా ప్రజలకు వేరే నోట్లు దొరకని పరిస్థితి ఉంది. మారేడుపల్లిలోని టిఫిన్ సెంటర్లో మాత్రం కొత్త రూ.5 వందల నోటు యజమానికి చేరడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాస్తవంగా బ్యాంకులకు ఇప్పటివరకూ కొత్త ఐదు వందల నోటు రానే లేదు. మారేడుపల్లి నివాసి ఒకరికి తన సోదరుడు దిల్లీ నుంచి ఆ నోటును తేవడంతో టిఫిన్ చేసి అందించారు. విస్తృతంగా కొత్త ఐదు వందల నోట్లు వస్తే చిల్లర కష్టాలు కొంతమేరకైనా తీరతాయని అందరూ భావిస్తున్నారు.
ఇక ఆర్‌బీఐ వీలైనంత త్వరగా ప్రజలకు తగినంత నగదును అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుపుతోంది. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో రూ.500 కొత్త నోట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే శనివారానికల్లా కొత్త రూ.500 నోట్లు హైదరాబాద్‌కు వచ్చేస్తాయని అధికారులు తెలిపారు. నోట్ల తరలింపు కోసం అధికారులు హెలికాఫ్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు. తగినన్ని చిన్న నోట్లు లేకపోవడంతో సామాన్యుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నాడని బ్యాంకు యూనియన్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల్లో హైదరాబాద్‌కి రూ.500 నోట్లు రానున్నాయి.