తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలకు లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం ముస్తాబైంది. ఈనెల 19వ తేదీన అమ్మవారి బోనాల జాతర, 111వ వార్షిక బ్రహోత్సవాలు ప్రారంభమై 29వ తేదీ వరకు జరుగుతాయి. హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రాత్మక లాల్‌దర్వాజ సింహావాహిని శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలలో భాగంగా ఆలయ శిఖరంపై కలశస్థాపన, ధ్వజారోహణ ద్వారా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌లు గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలోని ప్రత్యేకత ఉన్న లాల్‌దర్వాజ బోనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన దానకిషోర్, అంజనీకుమార్‌లకు ఆలయ ట్రస్టీలు ఘనంగా సాంప్రదాయ మేళతాళాలతో స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ ద్వారా మహంకాళి ఆలయ శిఖరంపై పూజలు నిర్వహించి పూలమాలలు సమర్పించారు. ఆలయంపై ధ్వజారోహణం చేసిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ.. బోనాల పండుగకు హైదరాబాద్ నగరంలోని వివిధ దేవాలయాల వద్ద రూ. 25కోట్లతో పలు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. బోనాల పండుగ పురస్కరించుకొని నగరంలో అన్ని దేవాలయాలకు దారితీసే రోడ్ల మరమ్మతులు, ఫుట్‌పాత్‌ల మరమ్మతులు తదితర పనులను చేపట్టడంతో పాటు బోనాలు జరిగే అన్ని దేవాలయాల వద్ద భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని జోనల్, డిప్యూటి కమిషనర్లు, ఇంజనీర్లను ఆదేశించినట్టు తెలిపారు.
ఈ దేవాలయాల వద్ద హైమాస్ లైటింగ్‌తో పాటు వీధి దీపాలన్ని వెలిగేవిధంగా చర్యలు చేపట్టామని, రోడ్ల మరమ్మతులు, పటిష్టతతో పాటు దేవాలయాల వద్ద శానిటేషన్‌ను పకడ్బందీగా చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఆర్ఓ కె.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.