కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ సందర్భంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, విశ్వాసపరీక్షను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ రమేశ్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభం కానుంది. విప్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అస్పష్టంగా ఉందంటూ కాంగ్రెస్-జేడీఎస్ నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దీనిపై భాజపా సభ్యులు నిరసనబాట పట్టారు.
సభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు బయటకు రాగా, బీజేపీ సభ్యులు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఈ రోజే విశ్వాసపరీక్ష జరగాలని పట్టుబట్టిన బీజేపీ సభ్యులు స్పీకర్ ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. వాయిదాపడిన సభలోనే బైఠాయించారు. రాత్రంతా ఇక్కడే ఉంటామని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి పన్నెండు గంటలైనా సరే ఓటింగ్ చేపట్టాల్సిందేనని అన్నారు. గవర్నర్ ఆదేశించినా ఓటింగ్ జరపడం లేదంటూ స్పీకర్ కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినదించారు.
విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు కాలయాపన చేస్తున్నాయని బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, సభకు హాజరు కాకపోయినా ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తప్పవని సీఎం కుమారస్వామి చివరి ప్రయత్నంగా తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తూ హెచ్చరించారు.