తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో నాయకులపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్నిచోట్ల డీసీసీ చీఫ్‌లను పట్టించుకోకుండా నియోజకవర్గ ఇంఛార్జ్‌లు,ఎమ్మెల్యేలు ఇష్టారితీన వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.
కరీంనగర్,పెద్దపల్లి,ఆదిలాబాద్,జగిత్యాల,ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాల్లో గ్రూప్ రాజకీయాలు పార్టీని మరింత బలహీనం చేస్తున్నారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయంతో పొన్నం ప్రభాకర్‌కు సఖ్యత లేకపోవడంతో కరీంనగర్ సమావేశానికి పొన్నం డుమ్మా కొట్టారు. అంతేగాదు జీవన్ రెడ్డి వర్గంలో మృత్యుంజయం ఉండగా పొన్నం మరో గ్రూప్‌గా ఉండటంతో జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది.
మహబూబ్ నగర్లో డీసీసీ చీఫ్ ఉబేదుల్లా కొత్వాల్‌కు జిల్లా సీనియర్లు మల్లు రవి, సురేందర్ రెడ్డి, ఇబ్రహీం, మధుసూదన్ రెడ్డి సహకరించడం లేదని పార్టీలో చర్చ సాగుతోంది. ఇక పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పెత్తనం చలాయిస్తున్నారని, అది డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొంరయ్యకు రుచించడం లేదని ప్రచారం జరుగుతోంది.
జగిత్యాల జిల్లా డీసీసీ చీఫ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొంరెడ్డి రాములు మధ్య సఖ్యత లేకపోవడం, ఆదిలాబాద్ డీసీసీ చీఫ్ భార్గవ్ దేశ్ పాండేతో అక్కడి సీనియర్ నేతలు రాంచంద్రారెడ్డికి, గండ్రత్ సుజాతకు పొసగడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఓ వైపు పార్టీలోని సీనియర్లు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటం..మరోవైపు గ్రూపు రాజకీయాలతో టీకాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.