రైతుల నుండి ప్రభుత్వం మద్దతు ధర కింద సేకరించిన పలు పంటలకు సంబంధించిన మొత్తం రూ.150.17 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రైతులకు ఎలాంటి బకాయిలు లేకుండా డబ్బులన్నీ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల విడుదల చేసి రైతుల అకౌంట్లలో జమచేయడం జరుగుతుంది. శనగలు, మినుములు, జొన్న, పొద్దుతిరుగుడు రైతులకు ఈ మేరకు మొత్తం డబ్బులు విడుదల చేయడం జరిగింది.
పంటలకు మద్దతుధరల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలలో స్పష్టతలేదని, పరిమిత పంటలకే కేంద్రం మద్దతు ధరకు అనుమతి ఇస్తుందని, మిగిలిన పంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మద్దతుధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
కేంద్రం మద్దతు ధర ఇచ్చే పంటలకు కూడా మద్దతు ధర కింద కేంద్రం అనుమతించే దానికి, క్షేత్రస్థాయిలో వస్తున్న దిగుబడికి పొంతన ఉండడం లేదని, ఇక్కడ కూడా రైతులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే పరిమితికి మించి కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులకు ఉన్న బకాయిలన్నీ విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.