జాతీయ సుస్థిర వ్యవసాయ పథకం కింద వ్యవసాయ భూములలో అటవీ చెట్ల పెంపకం పథకంపై రెండవ రాష్ట్రస్థాయి కార్యకవర్గ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి మాట్లాడుతూ…వ్యవసాయ భూములలో వ్యవసాయ పంటలతో పాటు అటవీచెట్ల పెంపకాన్ని పెంచడం ద్వారా వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చన్నారు.
సహజవనరుల పరిరక్షణతో పాటు ఉపాధి కల్పన , రైతులకు అటవీ చెట్ల ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా 2018-19 సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి సభ్యులకు పార్థసారధి వివరించారు. 2019-20 సంవత్సరానికి రూ.507.85 లక్షల రూపాయాలతో ప్రతిపాదించిన వార్షిక ప్రణాళికను ఆమోదించి, కేంద్రప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. 2018-19 సంవత్సరానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన రూ.133 లక్షల నిదులను విడుదలచేయాలని ప్రభుత్వానికి సమావేశం సిఫారసు చేసింది.
ఈ సమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ ఆశ, అటవీశాఖ అధికారిని సుభద్రదేవి, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ, కేంద్రీయ మెట్ట పరిశోధన సంస్థ శాస్త్రవేత్త ఉస్మాన్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు శైలజ, ఉద్యాన శాఖ ఉపసంచాలకులు బాబు, తదితరులు పాల్గొన్నారు.