వివాదంలో సన్నీ.. మండిపడ్డ ప్రతిపక్షాలు

452
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, గురుదాస్‌పూర్‌ ఎంపీ సన్నీడియోల్ చేసిన ఓ పని వివాదానికి కారణమైంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున సన్నీ దేవోల్‌ పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్‌ జాఖర్‌పై విజయం సాధించారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఎంపీ అయినా సమావేశాలకు మాత్రం తాను నియమించే మరోవ్యక్తి హాజరవుతారని మంగళవారం సన్నీ డియోల్‌ తెలిపారు.

ఈ మేరకు సన్నీ ఓ లేఖను కూడా విడుదల చేశారు. ‘‘మొహాలి జిల్లా పల్హేరీ గ్రామానికి చెందిన గురుప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తిని నా ప్రతినిధిగా నియమిస్తున్నాను. ఇక నుంచి నా నియోజకర్గానికి సంబంధించి జరిగే అన్ని సమావేశాలు, కార్యక్రమాలకు నా తరపున ఆయనే హాజరవుతారు’’ అని లేఖలో సన్నీ డియోల్ పేర్కొన్నారు.

MP Sunny Deol

అయితే సన్నీ డియోల్ చేసిన ఈ చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. తనని గెలిపించిన ప్రజల్ని సన్నీ డియోల్‌ వంచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటర్లు ఎన్నుకున్న ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఎలా నియమిస్తారని నిలదీశారు.

ప్రతిపక్షాల విమర్శలపై సన్నీ డియోల్ ప్రతినిధి గురుప్రీత్ సింగ్ స్పందించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసమే సన్నీ తనను నియమించారని, ప్రతి నెల ఆయన స్వయంగా నియోజకవర్గంలో పర్యటిస్తారని అన్నారు. 24 గంటలు ప్రజాసేవలో ఉండాలన్న ఉద్దేశంతోనే సన్నీ డియోల్ తనను ప్రతినిధిగా నియమించారని సమర్థించుకున్నారు.

- Advertisement -