పెద్దనోట్ల రద్దు చేయబడి నేటితో 10రోజులు పూర్తి కావస్తోంది. ఇంకా రూ.2000లకు చిల్లర ఎక్కడ దొరకడం లేదు. ఏటీఎం, బ్యాంక్‌లల్లో వందనోటు అందుబాటులో లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాలు బేజారుఅయ్యాయి. బ్యాంకుల నుండి సరిపడినంత డబ్బు తీసుకునే వెసులుబాటు లేక చిన్నవ్యాపారులు చితికిపోతున్నారు. మార్కెట్లో వారు సైతం డబ్బుతోనే సరుకులు కొనుగోలు చేయవలసి రావడం చేత వారి వ్యాపారాలు మందగిస్తున్నాయి. చాలా దుకాణాల్లో సరుకులు సన్నగిలిపోయాయి.
రూ.500,1000నోట్ల రద్దుతో అనేక కుటుంబాలు కష్టాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో వారికి ఈ సమస్య మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. దీంతో ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వివాహాలు జరుపుతున్న కుటుంబాలు ఒకేసారి రూ. 2.5 లక్షల వరకు బ్యాంకుల నుంచి తీసుకోవచ్చునని ప్రకటించింది.
అయితే,… కేంద్రం ఈ సీజన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం బీజేపీలో చాలామంది బ్రహ్మచారులు ఉండటం వలనేనని యోగా గురువు బాబా రామ్‌దేవ్ సెటైర్ వేశారు. నోట్ల రద్దు అంశంపై స్పందిస్తూ జోక్ చేశాడు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్ బాబా ప్రభుత్వ చర్యపై స్పందిస్తూ నవ్వులు పూయించాడు. బీజేపీ పార్టీలో బ్రహ్మచారులే ఎక్కువ కాబట్టి, వాళ్లు వెడ్డింగ్ సీజన్‌ను అంచనా వేయలేకపోయారని కామెంట్ చేశాడు. బీజేపీలో బ్యాచిలర్స్ ఎక్కువ అని, పెళ్లి సీజన్‌ను వాళ్లు గుర్తించలేకపోయారని, అది పొరపాటే అని రామ్‌దేవ్ అన్నారు. ఒకవేళ నోట్ల రద్దు అంశాన్ని మరో 15 రోజులో లేదా నెల రోజులో ఆలస్యంగా అమలు చేస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ఇక ఈ నిర్ణయం వల్ల ఒక మంచి కూడా జరిగిందని, చాలామంది కట్నం అడగటం లేదని ఈ సందర్భంగా యోగా గురువు రాందేవ్‌బాబా పేర్కొన్నారు .