సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రజనీకాంత్ సమర్థించిన విషయం తెలిసిందే. ‘హాట్సాప్ నరేంద్రమోదీజీ. ఇది నవ భారత జననం. జైహింద్’ అంటూ రజనీ ట్వీట్ చేశారు. అయితే మోడీపై రజనీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన అమీర్ రజనీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా గతంలో ఏనాడూ స్పందించని రజనీ ఇప్పుడు ప్రధాని మోడీని ప్రశంసించడాన్ని ఆయన తప్పుపట్టారు.
దేశంలో ఎన్నో అన్యాయాలు జరిగినా స్పందించని రజనీ మోడీని ఈ స్థాయిలో ప్రశ్నించడం వెనక ఆంతర్యం ఏంటని ఆయన అన్నారు. మోడీ పెద్ద నోట్ల రద్దుతో నవభారతం జన్మించిందని రజనీ అంటున్నారు. పాత భారతంలోనే మీ కబాలి సినిమా రిలీజ్ అయ్యింది…దమ్ముంటే ఆ సినిమా రెమ్యునరేషన్ విషయంలో మీకు ఎంత వైట్ ముట్టిందో చెప్పగలరా ? అని సవాల్ విసిరారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కన్నా అధికధరకు కబాలి సినిమా టికెట్లు అమ్ముకున్న విషయం ప్రజలందరికీ తెలుసని అమీర్ విమర్శించారు. ఈ విమర్శలు ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.