హ్యాపీడేస్‌తో ఎంట్రీ ఇచ్చి ‘స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లందుకున్న హీరో నిఖిల్. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని కనబరుస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్న నిఖిల్ తన ప్రయోగాల ఫార్ములానే నమ్ముకుని చేసిన చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఇప్పటికే ఫస్ట్ లుక్, ట్రైలర్‌తో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకరాభరణంతో నిరాశపర్చిన నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నివాడాతో ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..
కథ :
అర్జున్ (నిఖిల్) ఇంజనీరింగ్ స్టూడెంట్. తన స్నేహితుడు (వెన్నెల కిశోర్) కు ట్రీట్మెంట్ చేయించడానికి కేరళకు వెళతాడు. అక్కడే అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ హైదరాబాద్ తిరిగొచ్చాక తాను ప్రేమించింది ఒక ఆత్మనని తెలుకుని షాక్ అవుతాడు. అతను ఆ షాక్ లో ఉండగానే అమల ఆత్మ తనను ప్రేమించిన అర్జున్ ని వెతుక్కుంటూ వస్తుంది.అసలు అమల, అర్జున్ వెంటే ఎందుకు పడుతుంది..? నిఖిల్ ప్రేమించిన అయేషాకు ఏం అయ్యింది..? ఈ కథకు పార్వతికి సంబంధం ఏంటి..? చివరకు అమల ఆత్మ ఏమైంది..? అన్నదే మిగతా కథ..
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నందిత శ్వేత, నిఖిల్,స్క్రీన్ప్లే,కామెడీ.దర్శకుడు విఐ ఆనంద్ రొమాంటిక్ థ్రిల్లర్ ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ను జోడించి కథను చెప్పిన విధానం బాగుంది. కథలో ఎదో ఒక థ్రిల్ వస్తూ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో నడిచే కొత్తదనమున్న కామెడీ ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, సత్యలు టైమింగ్ ఉన్న పంచ్ లతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఒక ఆత్మగా నందిత నటన అద్భుతమనే చెప్పాలి.క్లైమాక్స్ రొటీనే అయినప్పటికీ అందులో నటనతో దానికి కాస్త కొత్తదనాన్ని తీసుకొచ్చింది
మైనస్ పాయింట్స్ :
రోటిన్ క్లైమాక్స్,అక్కడక్కడా స్లో నేరెషన్ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్. అక్కడక్కడా వచ్చే వెన్నెల కిశోర్ కామెడీని మినహాయిస్తే ఇంటర్వెల్ పడే వరకూ ఎక్కడా రిలీజ్ దొరకలేదు. సెకండాఫ్ కథనంలో కూడా కాస్త బలం లోపించింది. సెకండాఫ్ నడుస్తున్న కొద్దీ ఆహా.. క్లైమాక్స్ అద్దిరిపోయేలా ఉంటుంది అనుకుంటే క్లైమాక్స్ నిరుత్సాహపర్చింది.
సాంకేతిక విభాగం :
టైగర్ సినిమాతో దర్శకుడిగా మారిన విఐ ఆనంద్ రెండో ప్రయత్నంలో ఆకట్టుకున్నాడు. సక్సెస్ ఫార్ములాగా మారిన కామెడీ హర్రర్ జానర్నే నమ్ముకున్నా.. ఎక్కడా రొటీన్ సినిమా అన్న ఫీలింగ్ కలగకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సినిమాను నడిపించాడు. కథా కథనాల విషయంలో ఆనంద్ తీసుకున్న కేర్ ప్రతీ సీన్ లోనూ కనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ హైలెట్ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి. మహిషాసుర మర్థనీ ఆలయం, ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ విజువల్గా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం కూడా సినిమా మూడ్కు తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
శంకరాభరణంతో నిరాశపర్చిన నిఖిల్ మరోసారి తన ప్రయోగాత్మకమైన ఫార్ములాను నమ్ముకుని చేసిన చిత్రమే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఫస్టాఫ్ ఓపెనింగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, సెకండాఫ్ కథనం,నందిత శ్వేతా నటన సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా..బోర్ కొట్టించే కథనం, లాంగ్ రన్ టైమ్, రొటీన్ క్లైమాక్స్ సినిమాకు మైనస్. ఓవరాల్‌గా నిఖిల్ మార్క్ రొమాంటిక్,కామెడీ,థ్రిల్లర్ ఎక్కడికి పోతావు చిన్నివాడా.
విడుదల తేదీ : 18/11/2016
రేటింగ్ : 3.25/5
నటీనటులు : నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత
సంగీతం : శేఖర్ చంద్ర
నిర్మాత : పి.వి. రావ్
దర్శకత్వం : విని ఆనంద్