ఎన్నికల కోడ్ ముగియయడంతో పాలనపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్ మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా ఫోకస్ చేశారు. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. గత రెండేళ్లుగా రాష్ట్ర కమిటీలు తప్ప..ఇతర కమిటీలను ప్రకటించలేదు. ఈ సమావేశంలో కొత్త కార్యవర్గ నిర్మాణంతో పాటు పార్టీ నిర్మాణంలో మార్పుచేర్పులపై చర్చించనున్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగిరేలా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సభ్వత్వ నమోదు,ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్షించనున్నారు.
గత ప్లీనరీకి ముందు సభ్యత్వ నమోదు 70 లక్షలకు చేరింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీ అనే సంకేతాలు ప్రజల్లోకి పంపేలా సభ్యత్వ నమోదు బాధ్యతలను ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. మరో వైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ 21న సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని నభూతో నభవిష్యత్ అనేలా నిర్వహించాలని భావిస్తున్నారు కేసీఆర్. ఈ సమావేశంలో కాళేశ్వరం ఆరంభ సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.