ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వేకువజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాట్నా – ఇండోర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటన కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద ఈఘటన చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ రైలు పాట్నా నుంచి ఇండోర్ వెళ్తుండగా.. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఎస్2 బోగీ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 110మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు, వైద్యులు గాయపడిన వారికి ఘటనాస్థలిలోనే ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.

పాట్నా – ఇండోర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు ఇండియన్ రైల్వేస్ అధికార ప్రతినిధి అనిల్ సక్సెనా తెలిపారు. 14 బోగీలు పట్టాలు తప్పాయని సమాచారం అందుకున్న వెంటనే అక్కడ రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అనిల్ పేర్కొన్నారు.

ఈ రైలు ప్రమాదంలో 63 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు కాన్పూర్ ఐజీ జకీ అహ్మద్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ రైలు ప్రమాదంపై స్పందించారు. ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితి సమీక్షించాలని అఖిలేష్ యూపీ డీజీపీకి ఆదేశించారు.

రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు హోంమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైలు ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగటం కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుతో మాట్లాడానని మోదీ తెలిపారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను సురేశ్ ప్రభు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.

పాట్నా – ఇండోర్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, మెడికల్ సిబ్బందితో పాటు డీజీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని చెప్పారు. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుని పరిస్థితినిసమీక్షిస్తున్నారని తెలిపారు.

ఈ ఘటనలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు రూ. 3.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
పట్టాలు తప్పిన బోగీలను రైల్వే అధికారులు గుర్తించారు వాటి వివరాలు లగేజి ర్యాక్, GS, GS, A1, B1/2/3, BE, S1/2/3/4/5/6

పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులు యత్నిస్తున్నారు. పాట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఝాన్సీ – లక్నో ఇంటర్ సిటీ, ఝాన్సీ – కాన్పూర్ రైళ్లను రద్దు చేశారు.

