సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. ఏడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో విస్తరించిన 59 నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 59 స్ధానాల్లో 918 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అందరి కళ్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేసే వారణాసిపైనే ఉన్నాయి. మోడీపై 25 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుండి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా (ఘాజీపూర్), భోజ్‌పురి నటుడు రవికిషన్ (గోరఖ్‌పూర్) సహా మరో ఏడుగురు బీజేపీ నేతల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిర్దేశించనున్నాయి.వీరితో పాటు కేంద్రమంత్రులు హర్‌సిమ్రత్ కౌర్,హర్దిప్ సింగ్ పూరీ,కాంగ్రెస్ నేతలు పవన్ కుమార్ బన్సాల్,మనీశ్ తివారీ,అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
బీహార్‌లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున శత్రుఘ్న సిన్హా, బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ పడుతున్నారు. జార్ఖండ్‌లోని దుమ్కా నుంచి జేఎంఎం అధినేత శిబూసోరెన్, బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్‌తో తలపడుతున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.