పవిత్ర అమర్‌నాథ్‌యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో మెరుపు దాడి చేసి, ఏడుగురు యాత్రికులను బలితీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ముగ్గురు పోలీసులు సహా మరో 15 మంది గాయపడ్డారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. హైవే పైకి అమర్‌నాథ్ యాత్రికుల బస్సు రావడంతో యాత్రికులకు తుటాలు తగిలాయి.
అనంత్‌నాగ్‌కు సమీపంలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఒక సాయుధ కారుపై సోమవారం రాత్రి 8.20 గంటలకు ముష్కరులు దాడి చేశారు. పోలీసులు ప్రతిఘటించడంతో విచక్షణ కోల్పోయిన ముష్కరులు ఉన్మాదంతో కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే పైకి అమర్‌నాథ్ యాత్రికుల బస్సు వచ్చింది. ఉగ్రవాదుల తూటాలు తగలడంలో యాత్రికులు బలయ్యారు. వీరంతా అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని సందర్శించుకొని తిరుగుప్రయాణంలో ఉన్నారు.
ఉగ్రవాదుల దాడికి గురైన జీజే09జెడ్ 9976 నంబరు బస్సు గుజరాత్‌కు చెందినదని, అది సోనామార్గ్ నుంచి వస్తున్నదని అధికారులు వెల్లడించారు. అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సాయంత్రం 7 గంటల తర్వాత రోడ్డు మీదకు రావద్దన్న నిబంధనను ఆ బస్సు డ్రైవరు అతిక్రమించాడని అంటున్నారు. దాడి నేపథ్యంలో కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జమ్ము-శ్రీనగర్ హైవేపై భద్రతను ముమ్మరం చేశారు. ఈ దాడిని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. కశ్మీర్ చరిత్రలో చీకటి రోజని రాష్ట్ర మంత్రి నయీం అఖ్తర్ తెలిపారు. యాత్రికులను లక్ష్యంగా చేసుకోవడం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారని చెప్పారు.
శాంతియుతంగా అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న యాత్రికులపై జరిగిన ఘాతుకమైన దాడిని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఖండించేందుకు మాటలు చాలవని ఆయన అన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలతో, కుటిల పన్నాగాలతో భారత్‌ను కట్టిపడేయలేరని ఆయన పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోరా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో మాట్లాడానని, అన్నిరకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. దాడిలో సన్నిహితులను కోల్పోయినవారికి సానుభూతి తెలిపారు.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా జమ్ముకశ్మీర్ గవర్నర్, సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని తెలుసుకుని అన్నిరకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నేడు రాజ్‌నాధ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది..