ఈ నెల 13 నుండి 6 రోజుల పాటు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది నల్గొండ కోర్టు. శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని పోలీలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాస్ రెడ్డిని రేపు(13న) యాదాద్రి పోలీసులు తమ అదుపులోకి తీసుకోనున్నారు. విచారణలో భాగంగా కేసులో కీలక విషయాలను రాబట్టనున్నారు.
ఫేస్‌బుక్ స్నేహితులు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని అమ్మాయిలతో అతడికున్న పరిచయాలు తదితర విషయాలపై ఆరా తీయనున్నారు.దీంతో పాటు శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలిగా భావిస్తున్న యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే ఆమె ఆచూకీ ఇంతవరకు లభించకపోవడం, వేములవాడలోని అగ్రహారం గుట్టల్లో ఓ యువతి డెడ్‌బాడీని పోలీసులు కనుక్కున్నారు. దీంతో ఆమె శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. మొత్తంగా తెలంగాణలో సంచలనం సృష్టించిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహజ్వాలలతో రగిలిపోతున్నారు హాజీపూర్ ప్రజలు.