త్వరలో 5జీ కంప్యూటర్లు రానున్నాయి. 2019లో ఈ కంప్యూటర్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కంప్యూటర్ తయారీ సంస్థలైన డెల్, హెచ్‌పీ, లెనోవో, సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో కలిసి త్వరలో 5జీ టెక్నాలజీ ఉన్న పర్సనల్ కంప్యూటర్లను విడుదల చేయనుంది. ఈ మేరకు ఇంటెల్ సంస్థ ఇప్పటికే ఆయా కంపెనీలతో భాగస్వామ్యం అయినట్లు తెలిపింది.
వీటిలో అధునాతన ఇంటెల్ ఎక్స్‌ఎంఎం 8000 సిరీస్ కమర్షియల్ 5జీ మోడెమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2019 ద్వితీయార్థంలో 5జీ కంప్యూటర్లు వచ్చే అవకాశం ఉంది. 5జీ టెక్నాలజీతో రానున్న ఈ కంప్యూటర్లు 2 ఇన్ 1 పీసీల్లా పనిచేస్తాయి. అంటే వీటిని ల్యాప్‌టాప్‌లు లేదా ట్యాబ్లెట్ పీసీల్లా వాడుకోవచ్చన్నమాట.
ఇక ఇందుకు సంబంధించిన టెక్నాలజీతోపాటు సదరు 5జీ మోడెమ్స్‌ను ఇంటెల్ బార్సిలోనాలో జరగనున్న ఎండబ్ల్యూసీ 2018లో ప్రదర్శించనుంది. 5జీ మోడెమ్ కలిగిన కోర్ ఐ5 8వ జనరేషన్ ప్రాసెసర్లను ఇంటెల్ ప్రదర్శిస్తుంది.