5 కోట్లతో పద్మశాలి భవన్‌…

261
KCR padmashali bhavan

పద్మశాలీలకు అన్నివిధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. పద్మశాలిలు ఎదుర్కొంటున్న సమస్యలు,పరిష్కారమార్గాలపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్..వరాల జల్లు కురిపించారు. రూ. 5 కోట్లతో పద్మశాలి భవన్‌ను నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం 2.5 ఎకరాల స్థలం కేటాయిస్తామని తెలిపారు. పద్మశాలి భవన్‌ నిర్మాణానికి
టీఆర్ఎస్ పార్టీ తరపున రూ. 50 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. పద్మశాలీల సంక్షేమానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి చేయూత, ప్రోత్సాహం అందిస్తామన్నారు. పద్మశాలీల అభివృద్థికి బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నారు. వృత్తిని వదలిపెట్టినవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రచించాలని సూచించారు.

KCRచేనేత, నేత కార్మికులు నేసిన వస్ర్తాలను ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని తెలిపారు సీఎం. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంపిణీ చేసే చీరెలను, ఇతరత్రా ప్రభుత్వ అవసరాలకు వస్ర్తాలను సేకరించి, మార్కెటింగ్ కూడా చేస్తున్నామని తెలిపారు. మరమగ్గాలను ప్రభుత్వ నిధులతో ఆధునీకరిస్తున్నామని.. నూలు, రసాయనాలపై 50% సబ్సిడీ
అందిస్తున్నామని చెప్పారు.

పద్మశాలీల అభివృద్ధిపై ఆ సంఘం ప్రముఖులు, పెద్దలే క్రియాశీలంగా మారాలన్నారు. తమ కులంలో ఎవరు ఇంకా సంప్రదాయ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు? వారికోసం ఏమి చేయాలి?అనే దానిపై సమగ్ర రిపోర్టు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో గుండు సుధారాణి, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మ్యాడం బాబురావు, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, కోశాధికారి అంకం వెంకటేశ్వర్లు, ఆప్కో మాజీ చైర్మన్ మం డల శ్రీరాములు, వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ సాం బారి సమ్మారావు, ఎన్నారై ప్రతినిధి సామల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.