ఉద్యోగులకు ఆయన ఓ వజ్రం… !

261
- Advertisement -

ఏటా ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు పెద్ద ఎత్తున బహుమానాలు ఇస్తూ ప్రత్యేకత చాటుకునే ఢోలకియా ఈ ఏడాది కూడా దీపావళికి భారీ స్థాయిలో బహుమతులు ప్రకటించారు. ఢోలకియా యాజమాన్యంలో వజ్రాల వ్యాపారం చేసే హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ తన ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా 1,260 కార్లు, 400 ఫ్లాట్లు బహుమతులుగా ప్రకటించింది. దీపావళి బోనస్‌గా వీటిని ఇస్తున్నట్టు మంగళవారం జరిగిన ఉద్యోగుల సమావేశంలో ప్రకటించారు.

కంపెనీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల జాబితాలో 1,716 మంది ఉన్నారు. ఆయన 2011 నుంచి ఏటా ఇలా బొనాంజా అందిస్తున్నారు. గత ఏడాది ఈ కంపెనీ 491 కార్లు, 200 ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చింది. గతంలో బోనస్‌ కోసం రూ.50 కోట్లు వెచ్చించినట్లు హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని ఢోలకియా పేర్కొన్నారు.

diwali bonus

పేదరికం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సావ్‌జీ.. కరవు పీడిత సౌరాష్ట్రలోని అమ్రేలీ జిల్లా దుఢాలా అనే కుగ్రామం నుంచి సూరత్‌ చేరుకొని పని కోసం ఢోలకియా వజ్రాల పరిశ్రమలో చేరారు. 1978లో ఆయన రూ.169 నెల జీతంతో జీవిత ప్రస్థానాన్ని ఆరంభించారు. వజ్రాలు సానబెట్టే కార్మికుడిగా, తర్వాత మధ్యవర్తిగా పని చేశారు. 1991లో సొంత వ్యాపారం మొదలు పెట్టారు. అప్పట్లో ఆయన ద్విచక్ర వాహనంపై తిరిగేవారు. వజ్రాలకు సానపెట్టే ఈ కంపెనీ కాలక్రమంలో ఏటా రూ.6 వేల కోట్ల టర్నోవర్‌తో వ్యాపారం చేసే స్థాయికి ఎదిగింది. వేల కోట్ల రూపాయలకు వారసుడైన తన కుమారుడు ద్రవ్యా ఢోలకియాకు డబ్బు విలువ తెలియజెప్పేందుకు కేవలం రూ.7 వేలు నగదు, మూడు జతల బట్టలు ఇచ్చి కేరళ పంపించిన సంగతి తెలిసిందే. తనపేరు ఎక్కడా వాడకుండా నెలరోజులు గడిపిరావాలని షరతు విధించారు. 71 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఢోలకియా ఆస్తుల విలువ రూ.6000 కోట్లు.

- Advertisement -