తీవ్ర ఆనారోగ్యంతో తమిళనాడు సిఎం జయలలిత ఆస్పత్రి పాలయ్యారు. ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే జాతీయ మీడియా కథనాల ప్రకారం అమ్మను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలిస్తున్నట్లు పేర్కొన్నాయి. జయలలితకు మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో మరింత మెరుగైన చికిత్సను అందించడం కోసం సింగపూర్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు మీడియాకు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, జ్వరం తగ్గిందని చెప్పారు. ముఖ్యమంత్రికి సాధారణ ఆహారాన్నే ఇస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఇక జయలలిత త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరుగుతున్నాయి. ఆస్పత్రి బయట పలువురు మంత్రులతో పాటు అన్నాడీఎంకే మద్దతుదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
அன்புள்ள CM அவர்கள் விரைவில் நலமடைய இறைவனை பிராத்திக்கிறேன்
— Rajinikanth (@rajinikanth) September 24, 2016
జయలలిత త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకాంక్షించారు. ఈ మేరకు “డియర్ సీఎం… మీరు త్వరగా ఉపశమనం పొందాలని దేవుడిని ప్రార్థిస్తున్నా” అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెకు బొకే పంపారు. అందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం ఆందోళనకరంగా ఉందని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు.