నగరంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిమునిగాయి.
రాష్ట్రంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తోడు మరో రెండ్రోజులు భారీ వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సహాయచర్యలకు అవసరమైతే సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ను రంగంలోకి దింపాలని సూచించారు.
ఢిల్లీ పర్యటనలోనున్న సీఎం కేసీఆర్ గురువారం వర్షాలపై సమీక్షించారు. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్ర, శనివారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల్లోని అన్ని స్థాయిల అధికారులు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయచర్యలు చేపట్టాలని సూచించారు. కంట్రోల్‌రూంలు కూడా ఏర్పాటుచేసుకుని ప్రజలకు 24గంటలూ అందుబాటులో ఉండాలని తెలిపారు.
కేటీఆర్‌తోపాటు నగర మంత్రులు, అధికారులు రేయింబవళ్లు ప్రజలకు సహాయమందించాలని ఆదేశాలు జారీచేశారు. ఎంతటి అసాధారణ పరిస్థితులు వచ్చిన ఏ మాత్రం ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో పోలీస్, ఆర్‌ఏఎఫ్, ఆర్మీ విభాగాలను ఉపయోగించాలని సూచించారు. నగర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ప్రజల మధ్యనే ఉంటూ తక్షణమే స్పందించాలని నిర్దేశించారు.