సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం చేసినట్లవుతుంది. అంతేగాదు పర్యావరణాన్ని కాపాడటానికి సైక్లింగ్ ఒక మంచి మార్గం. సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో సైకిల్‌ను మూడు దశల్లో నేర్చుకోవడం మనం చూస్తా.
మొదటి దశ ‘కాంచి” . రెండవ దశ కడ్డీ, మూడవ దశ సీట్. అప్పుట్లో, సైకిల్ తొక్కడం అంత ఈజీ గా ఉండకపోయేది. ఎందుకంటే ఇంట్లో నాన్న లేదా కక్కయ్యొ, మామయ్యో ఏదైనా ఊరుకి బస్సులో వెళ్ళినప్పుడు అదే, సందుగా చిన్నగా వారి సైకిల్ ను బయటకు తీసేవారం. అప్పుడు సైకిల్ ఎత్తు 40 అంగుళాలు ( ఇంచులు ), ఇది మన చిన్నప్పుడు నిలబడి ఉన్నప్పుడు మన భుజానికి సమానంగా వచ్చేది. ఆ సైకిల్ ను తొక్కడం అంత సాధ్యం కాకపోయేది. ‘కాంచి” అనేది సైకిల్ ఫ్రేమ్‌లో చేసిన త్రిభుజం ఫ్రెమ్ మధ్య రెండు కాళ్ళను రెండు పెడల్స్ పై పెట్టి తొక్కేవారం.
మనకు పదేళ్లలోపు వయస్సు ఉన్న ఈడులో ఆ 40 ఇంచుల ఎత్తులో ఉన్న సైకిల్ ను తొక్కడం అంటే అప్పట్లో విమానాన్ని నడిపినంతగా ఫిలయ్యేవారమని ఇప్పటి తరానికి అంతగా తెలియదు. సైకిల్ నేర్చుకున్న క్రమంలో ఎన్ని సార్లు కింద పడి ముక్కు, మొహాలు పగులగొట్టుకున్నామో, కాళ్లకు దెబ్బలు తగిలిచ్చుకున్నామో లెక్కేలేదు.పైగా, సైకిల్ నేర్చుకునే క్రమంలో కిందపడగానే, అప్పుడు తగిలిన దెబ్బలను తూడ్చుకుంటూ, ఒక్కరమే లోపల లోపలే ఏడ్చేవారం. పైగా, సైకిల్ ను కింద పడేసి పయ్యలు వంకరపోయాయనో, పైడీలు ఖరాబ్ చేశారని నాయన చేతిలో తన్నులు తినేవారం కూడా. సైకిల్ నేర్చుకోవడం అనేది అదో జీవన పోరాటంగా ఉండేది.
కానీ, ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఐదేళ్ల వయసులో పిల్లలు పడిపోకుండా ఇరువైపులా రెండు చక్రాలు ఉన్న సైకిల్ తొక్కడం ప్రారంభిస్తున్నారు.. రెండు అడుగుల ఎత్తుగల చిన్న, చిన్న సైకిల్స్ అందుబాటులోకి వచ్చాయి. పిల్లలు ఇప్పుడు నేరుగా ఏవిధమైన ఆక్సిడెంట్లకు గురికాకుండానే సైకిళ్లను నేర్చుకుంటున్నారు. అంతెందుకు, మార్కెట్‌లో చిన్న బైక్‌లు, కార్లు కూడా అందుబాటులో రావడంతో వాటినే నేరుగా నడుపుతున్నారు. కానీ, చిన్న వయస్సులో పెద్ద సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ నడపడం జీవితానికి మొదటి పాఠమని నేటి పిల్లలు అర్థం చేసుకోలేని విషయం! భాద్యతలనేవి ఈ విధంగా ఉంటాయని సైకిల్ నేర్చుకోవడం ద్వారానే తెలుస్తాయి. అప్పట్లో, అమ్మ చెప్పినట్టుగా, కాంచి తొక్కుకుంటూ గిర్నీ కి పోయి పిండి పట్టించుక రావడం, కొట్లోకి వెళ్లి ఇంట్లకు కావాల్సిన సామాను తేవడం, కోపన్ షాప్ కు వెళ్లడం, బంధువులో లేదా తెలిసిన వారింటికి వెళ్లి ఏదో సమాచారాన్ని చేరవేయడం….. లాంటి విషయాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే మనస్సు ఆహ్లాదంగా మారిపోతుంది కదూ.
మరి మన తర్వాత “కాంచి” పద్దతిలో సైకిల్ తొక్కడం అనే సంప్రదాయం అంతరించి పోయిందనేది మాత్రం నిజం, మూడు దశల్లో సైకిల్ తొక్కడం నేర్చుకున్న ప్రస్తుత కాలంలోని చివరి తరం మనమే! అవే, మొదటి దశ… “కాంచి”. రెండవ దశ… కడ్డీ తొక్కడం . ఇక, మూడవ దశ… సీట్ పై కూర్చొని సైకిల్ నడపడం. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే నీటి సరఫరా బంద్!