రాష్ట్రంలో 2018, జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని సీఎం ప్రకటించారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం ఏ పథకం తీసుకున్న వందశాతం పారదర్శకంగా అమలు చేస్తున్నామని తేల్చిచెప్పారు.
రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటారని తేల్చి చెప్పారు. కచ్చితంగా వాళ్లే ఉంటారు. కాంగ్రెస్ వాళ్లను వేస్తే సమితి లక్ష్యాలను ముందుకు సాగనిస్తారా..? నమ్మకం ఉన్న వాళ్లనే సమితుల్లోనే సభ్యులుగా చేర్చుకుంటాం. మేం చేసేది తప్పైతే ప్రజలే తీర్పు చెబుతారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభ్యత్వం 56 లక్షలు. కార్యకర్త అయితే అనర్హుడు అయిపోతాడా.? అంటూ ప్రశ్నించారు.
కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉన్న తెలంగాణలో 23 లక్షల 62 వేల పంపుసెట్లు ఎవరి పుణ్యమా అని వచ్చాయని సీఎం ప్రశ్నించారు. ఆడపడుచులు తమ తాళిబొట్టును కుదువపెట్టి వ్యవసాయానికి ఖర్చు పెట్టారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో గత వారం రోజులుగా ప్రయోగత్మాకంగా విద్యుత్‌ను 24 గంటలు సరఫరా చేస్తున్నామని సీఎం తెలిపారు. రైతులు ఆటోస్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు సీఎం. ఆటోస్టాటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. వీటి వల్ల కలిగే నష్టాలపై రైతులకు ఎమ్మెల్యేలు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు .