20 లక్షల నుంచి 2 కోట్లకు పెరిగిన సింధు

299
Sindhus value is 2 crore
Sindhus value is 2 crore

నిలకడ లేదు.. ఆమె అంతగా ఆకట్టుకోలేదు’’ నిరుడు పీవీ సింధుకు వాణిజ్య ఒప్పందాల కోసం కార్పొరేట్‌ సంస్థల వద్దకెళ్లిన బేస్‌లైన్‌ వెంచర్స్‌కు ఎదురైన సమాధానం. సింధు, శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ భవిష్యత్‌ స్టార్లని కోచ్‌ గోపీచంద్‌ సిఫార్సు చేసినా మారని పరిస్థితి! మరిప్పుడు.. అంతా తలకిందులు! సింధుతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు పోటీపడుతున్నాయి.

ఇప్పుడు ఎక్కడ చూసినా  సింధు…సింధు…అభిమానులే కాదు కార్పొరేట్ కంపెనీలు జపిస్తున్న పేరిది. సింధుతో ఒప్పందాల కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. దీంతో రైజింగ్ రాకెట్ బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకంతో సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ స్టార్ అయ్యింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షెట్లర్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి సింధుకు అవార్డులు, రివార్డులు ప్రకటించాయి. సన్మానాలు చేశాయి.

రియోలో రజత పతకం సాధించిన రైజింగ్ రాకెట్ కెరీర్ మారిపోయింది. బ్రాండ్ వాల్యూ ఎన్నోరెట్లు పెరిగింది. సింధుతో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకోడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.  దీంతో సింధు బ్రాండ్‌ విలువ 10 రెట్లు పెరిగి రూ.2 కోట్లకు చేరినట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘జాతీయ స్థాయిలో పెద్ద వాణిజ్య ఒప్పందాలవి. ఒలింపిక్స్‌ కంటే ముందే కొన్ని ఒప్పందాలు కుదిరాయి. ఒలింపిక్స్‌ సన్నాహాల నేపథ్యంలో ఆ వివరాల్ని ప్రకటించలేదు. ఒలింపిక్స్‌కు ముందు సింధుకు ఎక్కువగా ప్రచారం కల్పించదల్చుకోలేదు.

సెప్టెంబరు రెండో వారంలో వాణిజ్య ఒప్పందాల వివరాలు ప్రకటిస్తాం. సింధుతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు పోటీపడుతున్నాయి’’ అని సింధు వాణిజ్య ఒప్పందాల్ని చూస్తున్న బేస్‌లైన్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌ రామకృష్ణన్‌ తెలిపాడు. ఒలింపిక్స్ విజయం చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి సింధు బ్రాండ్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.