భారతీయ చిత్ర పరిశ్రమ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు..తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన అందుకోని రికార్డులు లేవు. తెలుగు తెరపై నటనలో ఆయన చేయని ప్రయోగాలు లేవు. తెలుగు నాట ఆయనను వరించని పురస్కారాలు లేవు. ఆ మహానటుడే అక్కినేని నాగేశ్వరరావు. భారతీయ సినీ పరిశ్రమకు వందేళ్లయితే అక్కినేని నటుడిగా 75 ఏళ్లు రాణించారు. తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని ఓ నిఘంటువు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. అందులోని ప్రతి పేజీ సువర్ణసుందరమే. ఎన్నో పాత్రలకు తనదైన ట్రేడ్ మార్క్ నటనతో ప్రాణం పోసిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి నేడు..
అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 20న నాగేశ్వరరావు జన్మించారు. తెలుగు చిత్ర సీమకు ఒక కన్ను నందమూరి తారకరామారావు అయితే మరో కన్ను అక్కినేని నాగేశ్వర్ రావు. తన నటనతో, చలాకి తనంతో ఆనాటి నుండి ఈనాటి వరకు మహిళాలోక ఆరాధ్యునిగా నిలిచారు అక్కినేని. అభినయంతో మాత్రమే నడుస్తున్న సినిమాకు నాట్యాన్ని జోడించిన తొలి హీరో నటసామ్రాట్. అక్కినేని వారి నుండే పాటలకు కొత్త కల సంతరించుకున్నది అనడంలో అతిశయోక్తి లేదు. వారి నాట్యంతో ఆభాల గోపాలం ఆనందంతో నర్తించారు. అక్కినేని నాగేశ్వర్ రావుగారి విజయాలు తెలుగు సినిమా స్టామినానే మార్చేశాయి.
అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన తొలి చిత్రం ‘ధర్మపత్ని’ (1941). హీరోగా మొదటి సినిమా ‘సీతారామజననం’ (1944). అక్కినేని తొలుత జానపదాల్లో అలరించిన ఆయన ‘దేవదాసు’గా, ‘కాళిదాసు’గా మెప్పించారు. డాక్టర్ చక్రవర్తి, దేవదాసు, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, ప్రేమ్ నగర్, సెక్రెటరీ వంటి సినిమాలు ఏఎఎన్నార్ సుధీర్ఘ సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన ఆయనలోని నటనకు మచ్చుతునకలు. అక్కినేని నటించిన ప్రేమాభిషేకం 533 రోజులు దిగ్విజయంగా ప్రదర్శింపబడింది. ఇది ఎనిమిది దశాబ్దాల సినీ చరిత్రలో ఓ రికార్డు.
సినీ చరిత్రను తీసుకుంటే అత్యధికంగా సాగిన ప్రస్ధానం అక్కినేని వారిది. వారి నటనకు, నాట్యానికి పరవశించని తెలుగు వారు ముఖ్యంగా తెలుగింటి ఆడపడచు ఉండదు అనడంలో సందేహం లేదు.
ఎన్నో రికార్డులు…
ఓ వ్యక్తి 75 ఏళ్లు జీవించడమే గొప్ప అనుకుంటాం. కానీ 75 ఏళ్లు సినిమా పరిశ్రమలో అగ్ర నటుడిగా రాణించడం సాధ్యమేనా..? సాధ్యమైతే అది మామూలు రికార్డు కాదు… రికార్డులకే రికార్డు. అటువంటి రికార్డును సృష్టించిన లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు. ఒక కుటుంబంలోని మూడు తరాల నటులు స్టార్లుగా నిలదొక్కుకోవడం… ఒకే చిత్రంలో హీరోలుగా నటించడం… అది మరో రికార్డు. ‘మనం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లు నటించి భారతీయ సినీ రంగంలోనే చరిత్ర సృష్టించారు. ఇలా మరెవరూ సాధించలేని అరుదైన ఘనత అక్కినేని నాగేశ్వరరావుకే చెల్లింది. ఎన్టీఆర్‌తో పాటు తెలుగు సినిమాకు మూలస్తంభం ఆయన.
అక్కినేని నాగేశ్వరరావు వివాహం అన్నపూర్ణతో 1949 సంవత్సరం ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగసుశీల, సరోజ ఆయన సంతానం. భార్య పేరిట హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారు అక్కినేని. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి ఆయన నటించిన సినిమాలు 256. నటించిన చివరి సినిమా ‘మనం’. 75 సంవత్సరాల కెరీర్లో సాంఘీక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడానికి అక్కినేని ఎంతో కృషిచేశారు.
చిన్న అవార్డు నుండి అతిపెద్ద అవార్డు అయినా అక్కినేని వారి సొంత గూటికి చేరనిది ఎవ్వరికి అందదు అన్నది నానుడిగా మారింది. తన పోటీ దారుడ్ని మెచ్చుకోవడం… గొప్పదనాన్ని కీర్తించడం, తన ప్లస్సుల్నీ, మైనస్సుల్నీ బేరీజు వేసుకోవడం… ఏఎన్నార్‌కే చెల్లింది. తనకు నప్పని పాత్రల్లో ఏఎన్నార్ వేలుపెట్టలేదు. తాను చేసిన పాత్రల్ని ఇంకొకరు వేలు పెట్టి చూపించేలా నటించలేదు, అదీ.. అక్కినేని గొప్పదనం. అది అచ్చంగా ఆయన ఆత్మబలం!!