కర్ణాటకలో కాంగ్రెస్ , జేడీఎస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను గవర్నర్ కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ సింగ్, రమేష్ జెర్కీహోలీలు రాజీనామాలు చేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న ప్రస్తుతం తరుణంలో సంకీర్ణ సర్కార్‌కు ప్రమాదం వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో సంకీర్ణ సర్కార్ బలం అసెంబ్లీలో 117కి పడిపోయింది.
ప్రభుత్వ భూములను జిందాల్‌కు కేటాయించడంపై తన నియోజకవర్గ ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆనంద్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ఆనంద్ సింగ్ రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కూడా ధ్రువీకరించింది. మరో ఎమ్మెల్యే జర్కిహోలి రాజీనామా ధ్రువీకరించాల్సి ఉంది.
ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమి లేదని చెప్పారు కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్. మరోవైపు ఆనంద్ సింగ్ రాజీనామా నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప స్పందించారు. తాము ప్రభుత్వాన్ని కూలదోయాలని చూడడం లేదని, ఒకవేళ ప్రభుత్వం పడిపోతే తాము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కర్ణాటకలో 225 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 80, జేడీఎస్ 37 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కావాల్సిన 113 స్థానాలకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అధికంగా ఉన్నారు. తాజా రాజీనామాలతో ప్రభుత్వ బలం 115కు పడిపోయింది. మరోవైపు బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.