అతి వేగంతో వస్తూ అదుపుతప్పిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టడంతో 16 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈ తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని మణిపూర్ సమీపంలో జరిగింది. దన్హారా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మరో 12 మందికి గాయాలు అయ్యాయి.
డ్రైవర్ అతి వేగంగా బస్సును నడుపుతుండటం.. నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. జైపూర్ నుంచి ఫరుక్కాబాద్‌కు వెళ్తున్న బస్సుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 12మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 10మంది ప్రయాణికులను మైన్‌పురి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎత్వా జిల్లాలోని సఫాయీ ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది.
ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, అతి వేగమే కారణమని తెలుస్తోందని పోలీసులు తెలిపారు.