తెలంగాణ సీఎల్పీని టీఆర్ఎస్‌లో వీలినం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. గురువారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్ పోచారంకు అందజేశారు. స్పీకర్‌ని కలిసివారిలో సబితా ఇంద్రారెడ్డి,రోహిత్ రెడ్డి,జాజుల సురేందర్,రేగ కాంతారావు,కందాల ఉపేందర్ రెడ్డి,హరిప్రియ,వనమా వెంకటేశ్వరరావు,చిరుమర్తి లింగయ్య,దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,బీరం హర్షవర్థన్,గండ్ర వెంకటరమణారెడ్డి,ఆత్రం సక్కు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో 12 మంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక నల్గొండ నుంచి ఎంపీగా గెలిచిన ఉత్తమ్ ..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల బలం ఆరుకు పడిపోయింది.
సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. మూడింట రెండొంతులంటే 12 మంది సంఖ్యాబలం ఉంటే చాలు. ఈ నేపథ్యంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సభాపతికి అందజేశారు. గతంలో తెదేపా శాసనసభాపక్షం, కాంగ్రెస్ శాసనమండలి పక్షం ఇలాగే తెరాసలో విలీనమయ్యాయి. ఇదే వ్యూహంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ అసమ్మతి వర్గం ముందుకెళ్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌కు 91 మంది సభ్యులుండగా… కాంగ్రెస్ నుంచి 12, టీడీపీ నుంచి ఒకరు చేరితే ఆ పార్టీ బలం 104కి చేరుతుంది. దీంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పోయి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది.